హైదరాబాద్: హైదరాబాద్‌లో హైడ్రా మరోసారి కూల్చివేతలు (HYDRRA Demolitions) ప్రారంభించింది. మంగళవారం గచ్చిబౌలి, గాజుల రామారంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా అధికారులు.. బుధవారం పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడలో కూల్చివేతలు చేపట్టారు. అక్బర్‌నగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 303 నుంచి 306 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో 2 వేల గజాల మేర కబ్జాకు గురైన స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
తాజాగా చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్లో ప్రభుత్వ స్థలంతోపాటు రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి నిర్మించిన షాపులను హైడ్రా సిబ్బంది కూల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వెనక్కి వెళ్లిపోవాలని, తమ ఏరియా జోలికి రావొద్దని పాతబస్తీ వాసులు పోలీసులతో వాగ్విదానికి దిగారు. జేసీబీలు, హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నారు. హైడ్రాకు, రంగనాథ్‌కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన వ్యక్తంచేశారు. కొందరు జేసీబీకి ఎదురుగా నిలవగా, మరికొందరు జేసీబీ ఎక్కి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలకు ఆటంకం తలెత్తింది. అయితే నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.
పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ – చాంద్రాయణ గుట్టలోని అక్బర్ నగర్లో షాపులను కూల్చేసిన హైడ్రా
భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు
పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట
హైడ్రా జేసీబీ ఎక్కి, జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు
హైడ్రాకు,… pic.twitter.com/m4f4VFedCW
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025