సిటీబ్యూరో, మే 19(నమస్తే తెలంగాణ): నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా తొలగించింది. కూకట్పల్లి హైదర్‌నగర్, మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాలగూడలో ఆక్రమణలకు సంబంధించి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కమిషనర్ రంగనాథ్ చర్చించారు. హైదర్‌నగర్ సర్వే నెంబర్ 145లోని 9 ఎకరాల్లో డైమండ్‌హిల్స్ పేరుతో లేఔట్‌కు సంబంధించిన వివాదంలో వచ్చిన ఫిర్యాదుపై ఇరువర్గాలను పిలిచి హైడ్రా కార్యాలయంలో విచారించారు.
ఈ సందర్భంగా సంబంధిత కోర్టు ఉత్తర్వులను, పత్రాలను పరిశీలించాక కమిషనర్ ఆదేశాలతో హైడ్రా సిబ్బంది ఆ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించి ఈ స్థలాన్ని హైడ్రా కాపాడినట్లుగా బోర్డు పెట్టింది. నార్సింగి మండలం మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని డాలర్‌హిల్స్ లేఔట్లో ఉన్న వివాదంపై ప్రజావాణిలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరుపక్షాలను పిలిచి కార్యాలయంలో విచారించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్షీసీ సంస్థ చేపట్టిన నిర్మాణాలను ఆపడమేకాకుండా వాటిని తొలగించింది.