సిటీబ్యూరో/మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): హైడ్రా బృందం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాజ్సుఖ్నగర్లో బుధవారం హల్చల్ చేసింది. స్థల యజమాని లేని సమయంలో ఒక్కసారిగా జేసీబీలతో హైడ్రా బృందాలు వచ్చి రోడ్డుపై అడ్డంగా ఉందంటూ ప్రహరీని కూల్చేసింది. నాగారం మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులోని ఈస్ట్ హనుమాన్‌నగర్ రాజ్‌సుఖ్ నగర్ కాలనీలో సర్వే నంబర్ 146లో 40 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాన్ని కూల్చివేశారు. 40 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని హైడ్రా అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో బుధవారం హైడ్రా అధికారులు రెండు బృందాలుగా విడిపోయి జేసీబీల సహాయంతో రోడ్డుకు అడ్డుగా నిర్మించారంటూ గోడను తొలగించారు.
ప్రజలకు ఇబ్బందిగా ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరించాలని పలు కాలనీల వాసుల హైడ్రా దృష్టికి తీసుకురావడంతో అన్ని పత్రాలు పరిశీలించామని, రోడ్డును కబ్జా చేసి నిర్మించినట్లు నిర్ధారించిన తర్వాతే ప్రహరీని కూల్చివేశామని హైడ్రా అధికారులు తెలిపారు. అయితే హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టడానికి అక్కడికి వచ్చిన సమయంలో స్థానికులంతా టెన్షన్ పడ్డారు. ఆక్రమణలంటూ ఎలాంటి నోటీసులు రాకున్నా.. ఎవరి ఇండ్లు కూల్చుతారో అంటూ అందరూ భయపడిన పరిస్థితి. అయితే హైడ్రా ప్రహరీ కూల్చేసిన తర్వాత స్థానికులకు తాము కేవలం ఆక్రమణలు మాత్రమే తొలగిస్తామని చెప్పారు.
అడుగడుగునా హైడ్రామానే..
నాగారంలో హైడ్రా కూల్చివేతల తర్వాత ఆ స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆక్రమించినట్లు చెబుతూ హైడ్రా ప్రెస్‌నోట్ విడుదల చేసింది. నాగారం ప్రధాన రహదారికి కలిపే రోడ్డును నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆక్రమించి ప్రహరీ నిర్మించినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది. రెండు రోజుల్లో విచారణ చేపట్టి రోడ్డును ఆక్రమించినట్లు హైడ్రా నిర్ధారించింది. వెంటనే కూల్చివేయాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు కూల్చివేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మొదట విడుదల చేసిన ప్రకటనలో కీసర పోలీస్ స్టేషన్లో చంద్రారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నప్పటికీ.. మళ్లీ ఫిర్యాదు చేయలేదంటూ వేరొక ప్రకటన ఇచ్చారు. మరో వైపు మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడినట్లు హైడ్రా ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నప్పటికీ తనతో ఎవరూ మాట్లాడలేదని కమిషనర్ చెప్పారు.
అయితే హైడ్రా కూల్చివేసిన నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత యజమాని పాపిరెడ్డి కాగా హైడ్రా తన ప్రెస్‌నోట్‌లో చంద్రారెడ్డి పేరును ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ నిర్మాణానికి సంబంధించి హెచ్ఎండీఏ నుంచి రెగ్యులరైజేషన్ ఉండగా.. గతంలో కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై ఒక కమిటీ నివేదిక కూడా ఇచ్చిందని యజమాని పాపిరెడ్డి చెబుతున్నారు. అయితే స్థల యజమాని పేరు చంద్రారెడ్డి అని ఎందుకు హైడ్రా పేర్కొంటుందో ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా భూమి విషయంలో కోర్టులో కూడా వివాదం నడుస్తోంది. ఇంత జరుగుతున్నా.. హైడ్రా ఎందుకు దూకుడుగా వ్యవహరించిందనేది అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. అయితే ఇందులో హైడ్రాపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకే ఈ చర్యలకు హైడ్రా పూనుకుందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఫిల్మ్‌నగర్‌లో కూడా హైడ్రా కూల్చివేతలకు స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదే కారణమని యజమాని ఆరోపించారు.
అక్రమంగా కూల్చివేశారు: పాపిరెడ్డి, ప్లాట్ యజమాని
హైడ్రా అధికారులు తన ప్లాటు చుట్టూ ఉన్న ప్రహరీని అక్రమంగా కూల్చివేశారని ప్లాట్ యజమాని పాపిరెడ్డి ఆరోపించారు. 1980లో చేసిన లేఔట్ అని.. తాను 2007లో ఈ ప్లాటు కొనుగోలు చేశానని చెప్పారు. 2012లో రూ.1,19,700 ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించి, హెచ్ఎండీఏలో క్రమబద్ధీకరించుకున్నానని ఆధారాలన్నీ హైడ్రా కమిషనర్‌కు ఇచ్చానని చెప్పారు. గతంలో కాలనీవాసులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తే అధికారులు విచారణ చేపట్టారని, ఆ విచారణలో తాను కొనుగోలు చేసిన ప్లాటు రోడ్డుకు సంబంధం లేదని తేల్చారన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నదని, తన వద్ద ఇంజెంక్షన్ ఆర్డర్ కూడా ఉందని పాపిరెడ్డి చెప్పారు. హైడ్రా అధికారులు కొందరి ఒత్తిడి మేరకు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా వచ్చి, కూల్చివేశారని, దీనిపై న్యాయం పోరాటం చేస్తానని పాపిరెడ్డి తెలిపారు.