హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్ నగరవాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైడ్రా (HYDRA) బుల్డోజర్లు ఎక్కడ వచ్చి తమ నిర్మాణాలపై పడుతాయోనని భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి శుక్ర, శనివారాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా.. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రామ్‌నగర్‌లోని మణెమ్మ కాలనీలో అడుగుపెట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే మణెమ్మ కాలనీలోని నాలాపై నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ నిర్మాలను పరిశీలించారు.
తమ తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని భవన యజమాని రాజు అన్నారు. ఇన్నేండ్ల నుంచి ఇక్కడ రోడ్డు ఉందని ఏ అధికారీ చెప్పలేదని, ఇప్పుడు వచ్చి కూలగొడుతున్నారని చెప్పారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వాపోయారు.
సామాన్యులను భయపెట్టిస్తున్న హైడ్రా..
ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తామంటూ హైడ్రా నెల రోజులుగా హంగామా చేస్తూ 18 నిర్మాణాలను కూల్చి 43 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. హైడ్రా చేస్తున్న హైడ్రామాలతో నాలాలు, చెరువుల సమీపంలో కొన్నేళ్లుగా నివాసాలుంటున్న సామాన్య ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
సర్వే నంబర్ ఒకటేసి, పొజిషన్ మరో ప్రాంతంలో ఉండి కొందరు అనుమతులు పొంది భవనాలు నిర్మించారు. అలాంటి వాటికి రుణాలు సైతం బ్యాంకులు ఇచ్చాయి.. రిజిస్ట్రేషన్లూ అయ్యాయి. అన్ని సక్రమంగానే ఉన్నాయని లీగల్ ఓపినియన్ సైతం తీసుకొని చాలా మంది ఫ్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసిన వారున్నారు. అలాంటి వారు ఇప్పుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు బుల్డోజర్లు ఇండ్లపైకి వస్తాయా? అని భయపడుతున్నారు.