సిటీబ్యూరో, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): ‘మీకు చెబితే అర్ధం కాదు. సున్నంచెరువు దగ్గర డెబ్రిస్ ఎక్కడ నుంచైనా తీయవచ్చు. ఇదంతా కాదు. నెలరోజుల నుంచి చూస్తున్నాం. వర్షం పడుతుంది కాబట్టి రాలేదు. ఇప్పుడు ఇక ఆగేది లేదు. మీరు ఖాళీ చేయాల్సిందే.. లేకున్నా తవ్వేస్తాం. ఆ తర్వాత మీ ఇష్టం’.. ఇది హైడ్రా లేక్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ యూనస్ బెదిరింపు. ఆదివారం సున్నంచెరువు వద్ద సియేట్ కాలనీలో కాలనీవాసులు మాట్లాడుకుంటున్న సందర్భంలో అక్కడకు వచ్చిన యూనస్ స్థానికులతో వాగ్వాదానికి దిగారు.
తమను డైరెక్ట్‌గా బెదిరించడమే కాకుండా ఏకంగా ఇక్కడ ఉండొద్దని బెదిరించారని సియేట్ కాలనీవాసులు రవికుమార్, నాగేంద్రకుమార్ తదితరులు చెప్పారు. తాము కాలనీలో సైట్లను చూడడానికి వెళ్లి అక్కడ చర్చించుకుంటున్న క్రమంలో వచ్చిన యూనస్.. నెలరోజులుగా ఆగుతున్నామని, ఇక ఆగేది లేదని చెప్పారని అంతేకాకుండా తమందరిని డైరెక్ట్‌గా వెళ్లి కమిషనర్ రంగనాథ్‌ను కలిసి లెటర్ ఇవ్వాలని ఒత్తిడి చేశారని వారు ఆరోపించారు.
భూమికి బదులు భూమి కావాలా, డబ్బులు కావాలా చెప్పాలని, హైడ్రా కమిషనర్, ఎమ్మెల్యే గాంధీ ఈ విషయంలో అనుకూలంగా ఉన్నారని, ఈ భూమి వదిలేసుకుంటామని లెటర్ ఇవ్వాలని యూనస్ బెదిరించినట్లు వారు చెప్పారు. కోర్టు ఆర్డర్ ఉండగా తమ లేఔట్లోకి ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తే వ్యంగ్యంగా మాట్లాడారని, తాను ఎక్కడైనా డెబ్రిస్ తీసుకోవచ్చని, సోమవారం నుంచి తవ్వకాలు కొనసాగిస్తామన్నట్లు సియేట్ కాలనీ వాసులు చెప్పారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చెరువులను అభివృద్ధి చేసినందుకు ఇక్కడ చెరువుల అభివృద్ధి కోసం కన్సల్టెంట్‌గా యూనస్‌ను తీసుకున్నట్లుగా హైడ్రా చెప్పిందని, కన్సల్టెంట్‌కు తమను ఖాళీ చేయించే అధికారం ఎవరిచ్చారని కాలనీ వాసులు ప్రశ్నించారు.
ఇప్పటివరకు సున్నం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ ఖరారు కాకుండానే, అసలు చెరువు ఎంత ఉన్నదో తేలకుండానే తమపై దౌర్జన్యం చేస్తున్నట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జీటీ ఇచ్చిన రిపోర్టులో ఉన్న చెరువు పరిస్థితి తెలుసా.. అని స్థానికులు అడిగితే హైడ్రా వచ్చిన తర్వాత నుంచి మీరు ఇబ్బంది పెడుతున్నారని, కమిషనర్‌ను కలిసి కాలనీ వాసులంతా భూమి ఇచ్చేస్తామని చెప్పాలంటూ బెదిరించారని సియేట్ కాలనీ వాసులు చెప్పారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే గాంధీ పేరు కూడా హైడ్రా వాళ్లు వాడుతున్నారని, ఇప్పటివరకు చెరువు విస్తీర్ణం కానీ, ఎఫ్టీఎల్ నిర్ధారణ కానీ జరగకముందే వచ్చి తమ భూములను, ఇండ్లను ఎలా లాక్కుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయించామని, కోర్టు ఉత్తర్వులను కూడా హైడ్రా పట్టించుకోకుండా అందుకు విరుద్ధంగా చెరువులో చేయాల్సిన పనులను తమ కాలనీ లేఔట్లో చేస్తున్నారని సియేట్ కాలనీ వాసులు ఆరోపించారు.