Ranganath | సిటీబ్యూరో/కొండాపూర్: చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. సోమవారం ఆయన చందానగర్లో ఉన్న భక్షికుంట, రేగుల కుంటను లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచే ఆనంద్ మలిగావద్తో కలిసి కమిషనర్ సందర్శించి…. చెరువుల అభివృద్ధిపై చేపట్టిన విధానాలపై హర్షం వ్యక్తం చేశారు.
చందానగర్లో ఉన్న భక్షికుంట, రేగుల కుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్.. చెరువుల అభివృద్ధిపై చేపట్టిన విధానాలపై హర్షం వ్యక్తం చేశారు. తక్కువ నిధులతో ఈ రెండు చెరువులను అభివృద్ధి చేయడంపై అభినందించారు. నగరంలో మరో 10 చెరువులను కూడా ఈ రెండు చెరువుల తరహాలోనే అభివృద్ధి చేస్తామని, దీనికి వీటినే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పి..బీఆర్ఎస్ సర్కారు పనితీరుకు గుర్తింపునిచ్చారు. అయితే హైడ్రా కమిషనర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారితే… కాంగ్రెస్కు ఇదొక చెంపపెట్టులాంటిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో చెరువులను ఆధునీకరించాలనే సంకల్పంతో మూడేండ్ల కిందటే ఈ రెండు చెరువులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ కార్యక్రమంలో ఐటీ కంపెనీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది.
అయితే వీటి ఆధునీకరణ పనులను మలిగావద్ ఫౌండేషన్ పర్యవేక్షించగా, వాకింగ్ ట్రాక్, మురుగు నీరు చేరకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనులు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే ఆధునీకరణ చేసిన చెరువులను ప్రారంభించారు. కాగా, నగరంలోని చెరువుల పునర్జీవం, సంరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై పొలుష్యన్ కంట్రోల్ బోర్డు అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చించారు. పీసీబీ మెంబర్ సెక్రటరీ జి. రవి, అధికారులతో నగరంలో చెరువుల్లోకి చేరుతున్న పారిశ్రామిక వ్యర్థాలు, సీవరేజీ వాటర్ నిర్వహణ, ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.