HYDRAA | సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ): ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు, తౌటోని కుంటల్లో మంగళవారం హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు సీరియస్ అయింది. మరోవైపు కూల్చివేతల బాధితులంతా హైడ్రా చర్యలను నిరసించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం ఖాజాగూడ కూల్చివేతలపై ఓ ప్రకటన విడుదల చేశారు. తమ నివాసాల్లోకి వరదనీరు వస్తున్నదంటూ చెరువు ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు మేరకు భగీరథమ్మచెరువు, తౌటోనికుంటలను రెండుసార్లు క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పర్యటించిందని రంగనాథ్ పేర్కొన్నారు.
ఆ తర్వాత గత నెల 28వ తేదీన బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో కమర్షియల్ షాప్ ఓనర్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్, శిఖం పట్టాదార్లతో సమావేశమయ్యామని, అదే సమయంలో గూగుల్ మ్యాపులను చూపించి ఆక్రమణలపై వివరించామని తెలిపారు. ఎనిమిదేళ్ల కిందటే తౌటోనికుంటకు ఫైనల్ నోటిఫికేషన్, భగీరథమ్మ చెరువుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి ఎఫ్టీఎల్, బఫర్జోన్ల హద్దులను నిర్ధారించారని రంగనాథ్ తెలిపారు. నవంబర్‌లో భగీరథమ్మ చెరువులో భవన నిర్మాణ వ్యర్థాలను డంప్ చేస్తున్న కంపెనీ యజమానిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
అదేవిధంగా భగీరథమ్మ చెరువు, తౌటోనికుంటల బఫర్‌జోన్‌లో ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని హైడ్రా కార్యాలయంలో జరిగిన మీటింగ్‌లోనే నాలుగైదురోజుల్లో ఖాళీ చేయాలని హెచ్చరించినా వారు ఖాళీ చేయకపోవడంతో డిసెంబర్ 30వ తేదీన నోటీసులిచ్చి 31న కూల్చేశామని తెలిపారు. వాటర్బాడీస్ను ఆక్రమించిన వారికి ఎటువంటి నోటీసులివ్వకుండానే కూల్చేసే అధికారముంటుందంటూ మున్సిపల్ యాక్ట్, సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని రంగనాథ్ పేర్కొన్నారు. తౌతోనికుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలకు సంబంధించిన గూగుల్ చిత్రాలను పత్రికలకు విడుదల చేశారు.