సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తే నగరంలోని రహదారులు నీటమునగకుండా చర్యలు తీసుకునే అవకాశముంటుందని.. ఆ దిశగా అందరూ ముందుకురావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు. మంగళవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో హైదరాబాద్‌కు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులతో రంగనాథ్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ముందుగా మాన్సూన్కి సంబంధించి వరదనీటిలో మునిగే ప్రాంతాలలో తలెత్తుతున్న సమస్యలను అధికారులు వివరించారు. నగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 349 ప్రాంతాల్లో వరద ముప్పు ఉందని, వర్షం సమాచారం తెలియగానే ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రంగనాథ్ సూచించారు. మరో మూడురోజులలో 51 హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలకు 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు కూడా తోడవుతాయని.. సరిళ్లవారీగా జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఈ బృందాలు పనిచేస్తాయని ఆయన తెలిపారు.
ఈ బృందాలకు జలమండలి, ట్రాఫిక్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు చెందిన సిబ్బంది కూడా తోడయితే నగరానికి వరద ముప్పు చాలావరకు తగ్గించవచ్చని తెలిపారు. ట్రాఫిక్ జాయింట్ సీపీలు గజరావు భూపాల్, జోయల్ డేవిస్, హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వీ పాపారావు, హైడ్రా, ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కబ్జాలపై ఫిర్యాదు చేయండి..
నగరంలో చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే వాటిని పరిరక్షించే దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని హైడ్రా కోరుకుంటున్నదని, ఇందులో భాగంగా ఫిర్యాదులను హైడ్రా వాట్సప్ నెంబర్ 87124 06899 కు పంపాలని హైడ్రా అధికారులు కోరారు. తమకు తెలిసిన సమాచారానికి సంబంధించిన ఫోటోలతో పాటు ప్రాంతాలను తెలియజేసే లొకేషన్‌ను షేర్ చేయాలని, కమిషనర్ హైడ్రా పేరుతో ఉన్న ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా సమాచారం ఇవ్వాలని సూచిస్తూ, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 72079 23085 నంబర్ ద్వారా నేరుగా సమాచారం పంపించవచ్చని వారు పేర్కొన్నారు.