సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): లేఔట్ ఏదైనా అందులోని పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని హైడ్రా సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు. శనివారం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో జరిగిన సదస్సులో హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు చెందిన పలువురు నిపుణులు హాజరయ్యారు. 10శాతం ప్లాట్లు రిజిస్టేష్రన్ అయితే ఆ లేఔట్లను గుర్తించాల్సిన అవసరం ఉందని, ఒకవేళ అందులో మార్పులు చేయాల్సి ఉంటే అప్పటికే ప్లాట్లు కొన్నవారి అనుమతితో రివైజ్ చేయాల్సి ఉంటుందని, అదే సమయంలో పదిశాతం పార్కులు, ప్రజావసరాలకు కేటాయించాల్సిందని పలువురు అధికారులు తెలిపారు.
పంచాయతీ, మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ.. ఇలా ఏ స్థాయిలో లేఔట్ అనుమతులు పొందినా అందులోని పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలపై ప్రభుత్వానికి హక్కులుంటాయని తెలిపారు. అన్ఆథరైజ్డ్, అన్ అప్రూవల్, అప్రూవల్ లేఔట్లు ఏంటనే వాటిపై సంబంధిత జీఓలను పరిశీలించారు. ఎకరం స్థలంతో మొదలై ఎంత విస్తీర్ణంలో లేఔట్లు వేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆయా విషయాలపై సమగ్రంగా చర్చించారు.
లేఔట్లను రికార్డుల్లో నమోదు చేయాలి..
దశాబ్దాల క్రితం గ్రామ పంచాయతీలు అనుమతి ఇచ్చిన లేఔట్ల విషయం రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాల్సిన అవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది. సదరు భూమి లేఔట్‌గా మారిందనే విషయం రికార్డుల్లో నమోదు కాకపోవడంతోనే తర్వాత తరంవారు పాసుపుస్తకాలు తెచ్చుకుని ఆయా స్థలాలమీదకు వెళ్లి వ్యవసాయభూమి పేరిట ఆక్రమణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ అనుమతి పొందిన పాత లేఔట్ల విషయంలో కొన్ని ప్లాట్లు రెగ్యులరైజ్ అయితే ఆ లేఔట్‌ను గుర్తించినట్లేనని, తర్వాత ఆ భూమిని వ్యవసాయభూమిగా మార్చడం జరుగుతున్నదని, ఒకవేళ రద్దు చేస్తే అందులో ప్లాట్లు కొన్నవారి అనుమతితో మాత్రమే చేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రిలిమనరీ అప్రూవల్తో అమ్మకాలు జరపవచ్చని అయితే లేఔట్ స్వరూపం మార్చవద్దని పేర్కొన్నారు. తీసుకున్న అనుమతులకు విరుద్దంగా నిర్మించిన వాటిపైన చర్యలు తీసుకోవచ్చని సదస్సులో నిపుణులు తెలిపారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులపై చర్చించారు.
చెరువు పరిధిలో నోటీసులు అవసరం లేదు..
చెరువు పరిధిలో నిర్మించిన కట్టడాల విషయంలో కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా తొలగించవచ్చని, రహదారులు, పార్కుల్లో నిర్మాణాలు చేపట్టినా ఇది వర్తిస్తుందని సూచించారు. అలాగే రెగ్యులరైజ్ చేసిన ఇంటి స్థలాలు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తే వాటిని రద్దుచేసే అధికారం ఉంటుందని, పాత, కొత్త లేఔట్లు ఉన్న సమయంలో పాత లేఔట్లో రిజిస్టేష్రన్లు జరిగితే వాటిని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని, అలాగే ఫైనల్ లేఔట్ వస్తే అందులో ఎలాంటి మార్పులు చేయరాదంటూ సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల చేపట్టిన ఆక్రమణల తొలగింపుపై కమిషనర్ రంగనాథ్ సదస్సుకు హాజరైన నిపుణులతో చర్చించారు.