సిటీబ్యూరో, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): కూల్చేసే వ్యవహారంలో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులోనే ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూల్చేసేందుకు ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రైవేటు వివాదాల విషయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే జోక్యం చేసుకున్నామని, చెరువుల హద్దుల్లో నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదన్నారు. నాలాలు కూడా అభివృద్ధి చేసే పనిలో ఉన్నామని, చాలా చోట్ల నాలాలు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని పరిశీలించి కమర్షియల్‌గా ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు.
బషీర్‌బాగ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ ఏ వీ రంగనాథ్‌తో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్‌నారాయణ పాల్గొన్న ఈ కార్యక్రమంలో రంగనాథ్ మాట్లాడారు. హైడ్రా ఏర్పాటైన కొత్తలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నామని, కూల్చివేతల నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు.
హైడ్రా ఏర్పాటుకు ముందు పర్మిషన్లు ఉన్నా, లేకున్నా ఆ నిర్మాణాలను కూల్చేయొద్దంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీతో క్లారిటీ వచ్చిందన్నారు. ఇప్పుడు చెరువులు ఉన్న దగ్గర చాలా ఆక్రమణలు ఉన్నాయని, కొన్నిచోట్ల బస్తీలు ఏర్పడ్డాయని, వాటిని తొలగించకుండా ప్రస్తుతం ఉన్న చెరువు ప్రాంతాన్ని కాపాడుతూ చుట్టూ ఫెన్సింగ్ వేస్తామని చెప్పారు. మైత్రీవనం దగ్గర వరద నీరు రావడానికి మారిన పరిస్థితులు కారణమని, కృష్ణకాంత్‌పార్క్, కృష్ణానగర్ గతంలో చెరువులనీ, ఇప్పుడవి బస్తీలుగా, పార్కులుగా మారాయని, మళ్లీ కృష్ణకాంత్ పార్క్‌ను పన్నెండు ఎకరాల చెరువుగా మారిస్తే ఈ సమస్య తీరుతుందన్నారు.
సీఎస్ఆర్ పేరుతో చెరువులను అభివృద్ధి చేస్తామని వచ్చి కొన్ని ఎకరాల చెరువును అభివృద్ధి చేసి మిగతాది ఆక్రమించే వ్యవహారాన్ని ఒప్పుకోమని, స్వచ్ఛందంగా వచ్చి చెరువులు బాగు చేస్తే స్వాగతిస్తామన్నారు. ఎక్కడైనా హైడ్రా వచ్చిన తర్వాత చెరువుల్లో నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చేశామని, ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కుల్లో కమర్షియల్ ఆక్రమణలుంటే కూల్చేస్తామని హెచ్చరించారు.
80 శాతం ఎఫ్టీఎల్ నిర్ధారించాలి..
తమ పరిధి ఓఆర్ఆర్ వరకేనని, ఇప్పటి వరకు 80 శాతం చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారణ జరగలేదని, కేవలం ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారని, హైడ్రా ఏర్పాటు తర్వాత ఒక్క చెరువుకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని రంగనాథ్ చెప్పారు. చెరువుల హద్దుల విషయంలో విలేజ్ మ్యాప్, గూగుల్ చిత్రాలు, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్సీ మ్యాపులన్నీ చూడడంతో పాటు ఆయకట్టును పరిగణనలోకి తీసుకుంటున్నామని, తాము కచ్చితమైన డేటా సేకరించిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నామని, ఆ దిశగా అధ్యాయనం చేస్తున్నామన్నారు.
కొన్ని చెరువులను తీసుకొని వాటికి ఈ చిత్రాలు, పరిస్థితులన్నీ ఐప్లె చేసి.. ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే ఫైనల్ చేస్తామని, అదే విధానం సరిగా ఉన్నట్లు అనిపిస్తే వాటినే మిగతా చెరువులకు వర్తింపచేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఎన్వోసీల విషయంలో ఏం చెప్పకుండానే దాటేసిన రంగనాథ్.. తమ దగ్గరికి వచ్చి చెరువుల హద్దుల విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ వాళ్లు పంపే ఫైళ్లపై సంతకం పెట్టమంటే గుడ్డిగా పెట్టబోమని, తాము అన్నీ పరిశీలించాకే వాటికి ఒకే చెబుతామన్నారు.
ఒవైసీ కాలేజీ విషయంలో..
ఒవైసీ కాలేజీ కూల్చివేత విషయంలో తాము ప్రతీచోటా ప్రశ్నలు ఎదుర్కొంటున్నామని, సల్కం చెరువుకు ఎఫ్టీఎల్ నిర్ధారణ జరిగిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అయితే ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా చాలా చోట్ల కూల్చివేతలు చేపట్టిన వాటిపై రంగనాథ్ సమాధానం దాటేశారు. ఎన్ కన్వెన్షన్ చెరువు హద్దుల్లో ఉన్నది కాబట్టే కూల్చేశామని చెబుతూనే.. ఎక్కడ కూల్చాలన్నా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారణ తర్వాతే కూల్చివేస్తే కోర్టుకు సమాధానం చెప్పుకోగలమన్నారు.
తాము చేసే పనుల్లోనూ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సరిదిద్దుకొని ముందుకు పోతున్నామని రంగనాథ్ చెప్పుకొచ్చారు. అయితే హైడ్రా వచ్చిన కొత్తలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చేసి వారికి నిలువనీడ లేకుండా చేసిన దానిపై ఏం సమాధానం చెబుతారనేది ప్రస్తుతం కూల్చివేతల బాధితులు ప్రశ్నిస్తున్నారు. తాము ఇండ్లు లేకున్నా ఈఎంఐలు కడుతున్నామని, హైడ్రా దూకుడు చర్యల వల్ల తాము మొత్తం కోల్పోయామని చెప్పారు. దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు.
హైడ్రా పీఎస్‌కు సమస్యలున్నాయి..
హైడ్రాను జిల్లాలకు విస్తరించే విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, కానీ చాలా మంది ప్రజాప్రతినిధులు తనను జిల్లాలకు రావాలని కోరుతున్నారని, ఈ విషయంలో అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తామని చెప్పారని రంగనాథ్ తెలిపారు. ముఖ్యంగా హైడ్రా ఒకట్రెండు ఏండ్ల కోసం ఏర్పాటు కాలేదని, ఇది ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైడ్రా అనేది తమకు కొత్త సబ్జెక్ అనీ, తాము కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే లోటు పాట్లు సరిదిద్దుకుంటూ ముందుకువెళ్తున్నామని, కొన్నిచోట్ల తమ సొంతనైజమైన పోలీసు అధికారుల్లా వ్యవహరిస్తున్నామన్నారు.
హైడ్రా పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని, ఇందుకు కొన్ని న్యాయ, సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. కాగా, సాక్షాత్తు ముఖ్యమంత్రే వచ్చి ప్రారంభించిన పోలీస్‌స్టేషన్‌కు ఎలాంటి అధికారాలు లేవు. పీఎస్ ప్రారంభానికి ముందు కమిషనర్ ఇకపై ఫిర్యాదులన్నీ పీఎస్‌లోనే ఇచ్చేలా స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా.. అది అమలు జరగడం లేదని హైడ్రాకు వచ్చే ఫిర్యాదుదారులు చెప్పారు.
ఫిర్యాదులెక్కువ.. సిబ్బంది తక్కువ..!
తమకు ఇప్పటివరకు 25వేల ఫిర్యాదులొచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన సిబ్బంది తమకు లేరని రంగనాథ్ స్పష్టం చేశారు. తమ వద్ద కేవలం 50 మంది అధికారులు, 2వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని, వీరితో ఇన్ని ఫిర్యాదులను పరిష్కరించడం కష్టమైతున్నదని, అయినప్పటికీ ఏడెనిమిది నెలల కిందట ఫిర్యాదును కూడా ఇటీవల పరిష్కరించామన్నారు.
అయితే హైడ్రా ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే అక్కడికి తమ అధికారులను పంపించి కూల్చివేతలు చేస్తున్న కమిషనర్.. తమ సిబ్బంది కొరతను చూపిస్తూనే.. మరోవైపు తమకు అనుకూలమైన ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందిస్తున్నారనడానికి ప్రజావాణి ఫిర్యాదులే నిదర్శనమని కూల్చివేతల బాధితులు అంటున్నారు. నెలల తరబడి ఫిర్యాదులను పట్టించుకోని కమిషనర్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఎంపిక చేసుకొని మరీ.. అధికారులను వాటిపైకి పురమాయించడం వెనక ఆంతర్యమేంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాతే
ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ కూల్చివేత విషయంలో రంగనాథ్ మాట మార్చారు. నిన్నటివరకు చారిటీ అని, విద్యార్థుల భవిష్యత్ అంటూ చాలా చోట్ల చెప్పిన రంగనాథ్.. ఇప్పుడు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారించకుండా ఎలా కూల్చివేస్తాం అంటూ ప్రశ్నించారు. ఒక్క ఫాతిమా కాలేజీ మాత్రమే కాదు.. మల్లారెడ్డి, పల్లా వంటి వారి విద్యాసంస్థల విషయంలోనూ ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాతే తదుపరి చర్యలకు పోతామని, లేకుంటే కోర్టు ముందు తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని రంగనాథ్ చెప్పారు. తాము, తమ అధికారులకు హైడ్రా అనేది కొత్త సబ్జెక్ట్ అనీ, ఇందులో చాలామందికి సీపీసీ, ఐపీసీ గురించి తెలుసు కానీ చెరువుల వివరాలు తెలియవనీ, తాము నేర్చుకుంటూ వాటిని ఎలా అమలు పరచాలో మిగతా శాఖలతో కలిసి ప్రయత్నిస్తున్నామని రంగనాథ్ అన్నారు.