HYDRAA | శేరిలింగంపల్లి, డిసెంబర్ 31: ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో వెలసిన ఆక్రమ షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చి సదరు నిర్మాణ షెడ్లలో తలదాచుకొని.. రెక్కాడితే గాని డొక్కాడని వలస కూలీలు, పేదలు బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్నారు. ఇంట్లో సామగ్రి, పిల్లపాపలతో సహా బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
వివరాల్లోకి వెళితే… శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఖాజాగూడ సర్వే నం.18లో ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇటీవల ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి భగీరథమ్మ చెరువును ఆయన పరిశీలించారు. తాజాగా మంగళవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ప్రాంతానికి జేసీబీలతో చేరుకున్న హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్, బఫర్జోన్లోఉన్న దాదాపు 15 రేకుల షెడ్ల గదుల నిర్మాణాలు, పలు చిరువ్యాపారుల దుకాణాలు, నానక్‌రాంగూడ రోటరీ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న రేకుల ప్రహరీలు, రెండు గదులు, ఓ పశువుల కొట్టంను ఒక్కసారిగా నేలమట్టం చేశారు.
రోడ్డున పడ్డ వలస కూలీ కుటుంబాలు
కట్టుబట్టలు, వంట సామగ్రి, పసి పిల్లలతో పలు బాధిత వలస కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏండ్ల తరబడి ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తుండగా మరికొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. హైడ్రా చేపట్టిన ఈ కూల్చివేతలతో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు ఇంట్లో సామగ్రి తీసుకొని చంటి బిడ్డలతో సహా రోడ్డున పడ్డాయి. నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కార్యాలయాల్లో హౌస్‌కీపింగ్ పనులు చేసుకునే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ప్రాంతాలకు చెందిన కూలీల కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. మహిళలు, చిన్నారులు కూల్చివేతలు ఆపాలని బ్రతిమిలాడటం.. కన్నీరు మున్నీరుగా విలపించడం అందర్ని కలచివేసింది.
నోటీసులిచ్చి 24 గంటలు కాలేదు
హైడ్రా అధికారులు సోమవారం సాయంత్రం 4 గంటలకు నోటీసులు ఇచ్చారు. నోటీసులిచ్చి 24 గంటల గడవకముందే తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో తమ నిర్మాణాలు, ఇళ్లను నేలమట్టం చేశారు. తమది పట్టాభూమి అని, పాస్‌బుక్‌లు ఉన్నాయని, రోడ్డు విస్తరణలో స్థలం పోతే టీడీఆర్ సైతం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైడ్రా పేరుతో వచ్చిన అధికారులు పశువుల కోసం వేసిన షెడ్లు, గదులు, ఇతర నిర్మాణాలు పూర్తిగా కూల్చివేయడం అన్యాయం.
– కావలి యాదగిరి, నానక్‌రాంగూడ నివాసి
రోడ్డున పడేస్తే మాకు దిక్కెవరు..
నెలల తరబడి నివసిస్తున్న మమ్ముల్ని ఒక్కసారిగా హైడ్రా పేరుతో రోడ్డున పడేసి షెడ్లను కూల్చివేస్తే మేం ఎక్కడకు పోవాలి. మాకు దిక్కెవరు. చిన్నపిల్లలు, వంట సామగ్రితో సహా రోడ్డున పడ్డ మా బాధలు ప్రభుత్వం పట్టించుకోదా. వెస్ట్‌బెంగాల్ నుంచి వలసవచ్చి స్థానికంగా ఉన్న ఓ దవాఖానలో హౌస్‌కీపింగ్ పనులు చేసుకుంటున్నాం. అధికారులు ఇష్టారాజ్యంగా కూల్చివేసి రోడ్డున పడేశారు.
– షాతి మునోత్ రామ్,బాధితులు
చిన్నపిల్లలున్నా…కనికరించలే..
సామాన్లు తీసుకొని షెడ్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని, తమకు చిన్న పిల్లలున్నారని బ్రతిమిలాడినా అధికారులు కనికరించలేదు. జేసీబీలతో ఒక్కసారిగా నేలమట్టం చేశారు. పోలీసుల బందోబస్తుతో మమ్ముల్ని మాట్లాడకుండా చేసి కూల్చివేశారు.చిన్నపిల్లలతో రోడ్డుపడ్డాం. ఆకలితో ఉన్న పిల్లలకు అన్నం పెట్టేందుకు సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేశారు.
– సుమన్, కోల్కత్తా