సిటీబ్యూరో, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): ‘అంతా మేమే.. మీకు ఇష్టమైతే కలిసి రండి.. లేకుంటే లేదు. మేం చేసింది చూడండి’. ఇది హైడ్రా తీరు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుంటే జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ ఇతర విభాగాలను కలుపుకొనిపోవాల్సి ఉన్నా..ఆ పనిచేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా భారీవర్షాల కారణంగా నగరంలో నాలాలు పొంగిపొరలుతున్నాయి. ఎక్కడ చూసినా వరద ప్రవాహంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అధికారులు, సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. ప్రధానంగా హైడ్రాకు మొత్తం బాధ్యతలు అప్పగించినట్లుగా వారి నుంచి స్టేట్మెంట్లు వస్తుండడంతో పనిచేయాలనుకున్నవారు కూడా వెనక్కుతగ్గుతున్నట్లుగా కొన్ని శాఖల సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా నగరంలో వరద ప్రవాహం ఉన్నచోట , లాగింగ్ పాయింట్ల దగ్గర మొత్తం సెట్ చేస్తున్నామంటూ చెప్పుకుంటున్న హైడ్రా వ్యవహారం, సమన్వయం లేని వైఖరితో ఇతరశాఖలు ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరుగుతోంది.
గత సంవత్సరం వరకు బల్దియా ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ పనిచేసేవి. కానీ ఈసారి అందులో అవినీతి జరిగిందంటూ హైడ్రాకు వాటి బాద్యతలు అప్పగించారు. వారు చేయాల్సిన పనులపై హైడ్రా ఆధిపత్యం కనబర్చడంతో పాటు ఈ పనుల్లో అనుభవం లేని హైడ్రా సిబ్బంది నగరంలో గందరగోళ పరిస్థితిని సృష్టించారు. దీంతో యాకుత్‌పురాలో జరిగిన మ్యాన్‌హోల్ ఘటనకు తామే బాధ్యులమని ఒప్పుకోక తప్పలేదు. అంతేకాకుండా నాలాలలో కొట్టుకుపోయిన వారి ఆచూకీ తెలుసుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేదన్న విమర్శలు ఉన్నాయి.
శుక్రవారం అశోక్‌నగర్, శ్రీరాంకనగర్ కాలనీలలో రంగనాథ్ పర్యటనలో ఆయన చేసిన ప్రకటనలపై జీహెచ్ఎంసీ అధికారుల్లో చర్చ జరుగుతోంది. నాలాల వద్ద కాలువల నిర్మాణం, రిటైనింగ్వాల్లపై ఆయన ప్రకటనలు ఎలా చేస్తారని, తమకు సూచించాల్సిన చోట తానే అంతా అంటూ చెప్పుకోవడం కొంత ఇబ్బందిగా ఉందంటూ అధికారులు చర్చించుకుంటున్నారు.
కాగా, బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీ, దోమలగూడలోని గగన్‌మహల్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. శ్రీరాంనగర్ కాలనీని ముంచెత్తిన వరదనీరు హుస్సేన్‌సాగర్ నాలాలో కలిసేలా ఇక్కడ ఉన్న ఖాళీస్థలంలో కాలువ నిర్మాణాన్ని చేపట్టి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. శ్రీరాంనగర్‌కాలనీలో కాలువ తవ్వకం పనులను పరిశీలించారు. దోమలగూడలో వరద తగ్గిన తర్వాత పూడికను, కాలువలో ఆక్రమణలను కూడా తొలగిస్తామని చెప్పారు. అశోక్‌నగర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరద కాలువను అనుసంధానం చేసే నాలాను విస్తరిస్తామని రంగనాథ్ పేర్కొన్నారు.
హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు నిరంతరం సమన్వయం చేసుకుని పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, పోలీసు, విద్యుత్, వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తం చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.