HYDRAA | సిటీబ్యూరో: హైదరాబాద్ చెరువులను కాలుష్యరహితంగా మార్చే దిశగా దృష్టిపెట్టింది హైడ్రా. కాలుష్యనియంత్రణ బోర్డుతో ఇటీవల సమావేశమైన కమిషనర్ రంగనాథ్ చెరువుల శుద్ధీకరణపై చర్చించారు. చెరువులు కలుష్యకాసారంలా మారడానికి కారణాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా చెరువుల్లోకి మురుగునీరు ఎలా చేరుతుందో మార్గాలను తెలుసుకునే దిశగా ఆయా చెరువులు ఉన్న ప్రాంతాల్లో వివిధ శాఖల సమన్వయంతో సర్వే నిర్వహించాలని నిర్ణయించారు.
బెంగళూరు పర్యటన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పటికీ బడ్జెట్ కారణంగా అది వాయిదా పడింది. దీంతో చెరువులను శుద్ధీ చేసే ప్రక్రియపై హైడ్రా దృష్టిపెట్టింది. లేక్ మ్యాన్ ఆనంద్మల్లిగవాడ్తో కలిసి బెంగళూరులో ఆయన అభివృద్ధి చేసిన 35 చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో తొలిదశలో ఐదు చెరువుల శుద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో చందానగర్‌లోని ఈర్లచెరువు, అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, తార్నాకలోని ఎర్రకుంట, మాదాపూర్‌లోని తమ్మిడిచెరువు, ఖాజాగూడలోని తౌతాని కుంటలను పునరుద్ధరించాలని నిర్ణయించారు.
హైడ్రా పరిధిలో ఓఆర్ఆర్ లోపల 565 చెరువులున్నాయి. వీటిలో సుమారు వంద చెరువుల్లో మురుగునీరు ఉన్నట్లు హైడ్రా బృందం సర్వేలో తేలింది. చెరువుల్లో పూడికతీయడంతో పాటు ఆ మట్టితో గట్లు ఏర్పాటు చేసి.. సుందరీకరణ పనులు చేస్తారు. చెరువులోకి చేరే మురుగునీటిని శుద్ధీచేసే ప్రక్రియపై స్థానికులతో కలిపి ఒక పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
బృహత్ బెంగళూరు మహాపాలిక తరహాలో జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్లోపలి మున్సిపాలిటీల పరిధిలో చెరువుల్లోకి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, నాలాలు, అపార్ట్మెంట్ల ద్వారా వస్తున్న వ్యర్థాలపై దృష్టి పెట్టి ఆయా శాఖల సహకారంతో వాటిని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. ఏయే చెరువుల్లో పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్నాయో పరిశీలించి.. వాటికి నోటీసులను ఇవ్వాలని పీసీబీ బృందానికి హైడ్రా కమిషనర్ సూచించినట్లు తెలిసింది. అంతేకాకుండా అపార్ట్మెంట్లలో ఎస్టీపీలు ఏర్పాటుపై సంబంధిత అధికారులు పర్యవేక్షించి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు.
తొలివిడతలో 5 చెరువులను శుద్ధీ చేయడానికి నిర్ణయించారు. ఈర్లచెరువు, బతుకమ్మకుంట, ఎర్రకుంట, తౌతాని కుంట, తమ్మిడి చెరువులను ఎంపిక చేశారు. బతుకమ్మకుంట, ఎర్రకుంట, తౌతానికుంటలను ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ బృందం సందర్శించి…స్థానికులతో చెరువుల అభివృద్ధిపై చర్చించింది. తక్కువ ఖర్చుతో చెరువుల శుద్ధీకరణతో పాటు సుందరీకరణ చేపట్టాలనుకుంటున్నారు.