ఓ వైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామంటూ.. హైడ్రా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నమవ్వగా.. ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నది. ‘కండ్లు మూసుకుంటాం…పని కానిచ్చేయండి’ అన్నట్లు ఆక్రమణదారులకు వంతపాడుతున్నారు. ఫిర్యాదులు వస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఎల్బీనగర్ సర్కిల్ హస్తినాపురం డివిజన్ వెంకటేశ్వరకాలనీలోని జడ్పీ రోడ్ నం.3లో ఇంటి నంబర్ 8-7-98/84/వీ/ 22 ఉంది. దీని యజమాని కే. వేణుగోపాల్.
ఈయన నివాసం పక్కనే ప్లాట్‌లో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ప్రహరీని ఆనుకొని పిల్లర్ నిర్మిస్తూ.. ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. వెంటనే సంబంధిత మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోలేదు కదా.. ఆ నిర్మాణానికి పరోక్షంగా సహకరించారు. ఇంకేముంది.. అనుమతులు లేకుండానే సదరు వ్యక్తి రెండు, మూడో అంతస్తులనూ నిర్మిస్తున్నాడు.
– ఎల్బీనగర్
అక్రమ నిర్మాణంపై వేణుగోపాల్ ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి భవన నిర్మాణాన్ని ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చేపట్టాడని, చుట్టు పక్కల ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో నిర్మాణ వ్యర్థాలు తన నివాసంలోనే పడి ఇబ్బందికరంగా మారిందని వేణుగోపాల్ పేర్కొన్నారు ఎల్బీనగర్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేయగా, టౌన్‌ప్లానింగ్ అధికారులు తమ స్థలాన్ని పరిశీలించినా.. అక్రమ నిర్మాణం మాత్రం ఆగలేదన్నారు.
నోటీసులు జారీ చేసి.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా.. నోటీసులు ఇచ్చే విషయంలో మాత్రం తాత్సారం జరుగుతున్నదన్నారు. ఈ ఆలస్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న సదరు నిర్మాణదారుడు మూడో అంతస్తును కూడా నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తూ పిల్లర్లను నిర్మిస్తున్నట్లు వేణుగోపాల్ వాపోతున్నారు