HYDRAA | మేడ్చల్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల పరిశీలనకు హైడ్రా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ప్రభుత్వ భూముల పరిశీలనకు సంబంధించి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సమాయత్తం కావాలని సమాచారం వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు హైడ్రా అధికారులు పరిశీలించే సమయంలో తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు సంబంధించి ప్రభుత్వ భూముల వివరాలను హైడ్రా అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించగా, మిగతా ప్రభుత్వ భూముల వివరాలను హైడ్రా అధికారులకు సమర్పించారు. ఇదిలా ఉంటే సర్కారు భూముల్లో ఉన్న నిర్మాణాల వివరాల సేకరణలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాల లెక్క తేల్చేందుకే ప్రభుత్వ భూములను హైడ్రా పరిశీలించనున్నది. మేడ్చల్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు సంబంధించి 5,195 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గతంలో లెక్కలు తేలాయి. ఇటీవలే హైడ్రా అధికారులకు సమర్పించిన నివేదికలో కూడా 5 వేల పైచిలుకు ఎకరాలు మాత్రమే ఉన్నట్లు వివరించినట్లు తెలుస్తున్నది.
బాలానగర్ మండలంలో 700 ఎకరాలు, శామీర్పేట మండలంలో 420, దుండిగల్ మండలంలో 425, మేడిపల్లి మండలంలో 900, ఘట్కేసర్ మండలంలో 500, కాప్రా మండలంలో 400 ఎకరాలు, కీసర మండలంలో 417, కుత్బుల్లాపూర్ మండలంలో 600, బాచుపల్లి మండలంలో 360, ఉప్పల్ మండలంలో 333, మల్కాజిగిరి మండలంలో 113, మేడ్చల్ మండలంలో 37 ఎకరాలు ఉన్నాయి.
ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకే హైడ్రా భూములను పరిశీలించనున్నది. పరిశీలనలో భాగంగా ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్మాణాల లెక్కలను తేల్చనున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారుల వద్ద ప్రభుత్వ భూముల్లో నిర్మించిన నిర్మాణాల లెక్కలు ఉన్నప్పటికీ మరోసారి హైడ్రా అధికారుల పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు నిర్మాణాలను పరిశీలించనున్నారు. గుర్తించిన నిర్మాణాలపై తదుపరి చర్యల్లో భాగంగా నోటీసులు అందిస్తారని తెలుస్తున్నది.