బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో అక్కడి టెక్నోక్రాట్స్ ఎప్పుడో పెదవి విరిచారు. సిలికాన్ సిటీలో విపత్తుల నిర్వహణ పూర్తిగా ఫెయిల్యూర్ అంటూ పలు సంస్థలు నివేదికలిచ్చాయి. చెన్నై, బెంగళూరు సిటీలను కేస్ స్టడీలుగా తీసుకుని రీసెర్చ్ స్కాలర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వైఫల్యాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి తమ రిపోర్టులు తయారు చేశారు. గత నెలలో బెంగళూరులో కురిసిన వర్షాలకు నగరంలో దాదాపు చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రెండురోజుల పాటు సిటీ మొత్తం అతలాకుతలమైంది. అక్కడి డిజాస్టర్ మేనేజ్మెంట్ పూర్తిగా ఫెయిలయిందంటూ చాలా మంది విమర్శించారు.
HYDRAA | సిటీబ్యూరో: బెంగళూరు సిటీలో డిజాస్టర్ మేనేజ్మెంట్పై అధ్యయనం చేయడానికి రెండురోజుల పాటు హైడ్రా బృందం బెంగళూరులో పర్యటించింది. హైదరాబాద్‌లో డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు చెరువుల పునరుద్ధరణను సంబంధించి బెంగళూరు తరహాలో చేయడానికి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసింది. రెండురోజుల్లో మొదటిరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు బెంగళూరులో పునరుద్ధరించిన చెరువుల సందర్శన తర్వాత రెండో రోజు లేక్‌మ్యాన్ ఆనంద్మల్లిగవాడ్ డెవలప్ చేసిన చెరువులను సందర్శించారు. ప్రధానంగా ఈ పర్యటనలో చెరువుల పునరుద్ధరణలో బెంగళూరులో అవలంబించిన సహజ విధానాలపై హైడ్రా అధికారులు తెలుసుకున్నారు. వాటిని హైదరాబాద్‌లో చెరువుల పునరుజ్జీవానికి ఐప్లె చేయొచ్చా లేదా అనేది ప్రస్తుతం హైడ్రా బృందంలో చర్చ జరుగుతున్నది.
కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సెంటర్‌ను హైడ్రా అధికారులు సందర్శించారు. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ఎలాంటి చర్యలు చేపడతారో తెలుసుకున్నారు. వరద ముంచెత్తే ప్రాంతాల వారీగా అలర్ట్ చేయడం, ట్రాఫిక్ జామ్ అలర్ట్, ప్రత్యామ్నాయ రహదారులను సూచించే విధానాలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేఘ సందేశం యాప్ పనిచేసే విధానం , ఈ యాప్ ద్వారా ఏయే ప్రాంతాల్లో ఎంత మోస్తరు వర్షం కురుస్తుంది? ట్రాఫిక్ జామ్, వడగళ్లవానతో పాటు ఇతర వాతావరణ అంశాలతో అలర్ట్ చేసే ప్రక్రియను పరిశీలించారు. అయితే టెక్నాలజీ పరంగా బెంగళూరు ముందున్నా…అక్కడి పరిస్థితులు వేరు.. హైదరాబాద్ పరిస్థితి వేరు.. ఒక వర్షం పడితే బెంగళూరులో రహదారులే కాదు.. అపార్ట్మెంట్లే వరద నీటిలో మునిగిపోతుంటాయి.
మెట్రో రైళ్లు ఉన్నా ట్రాఫిక్ సమస్యకు ఇప్పటికీ తీరలేదు. బెంగళూరు తరహాలోనే హైదరాబాద్‌లోనూ ట్రాఫిక్ సమస్య ఉంది. వర్షం పడితే గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య తలెత్తడం.. కొన్ని ప్రాంతాల్లో ప్రయాణించాలంటేనే నగరవాసికి ప్రత్యక్ష నరకం కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో తీవ్రత లేదని హైడ్రా అధికారులే చెబుతున్నారు. అసలు హైదరాబాద్‌లో బెంగళూరు సిస్టం పనిచేస్తుందా..? టెక్నాలజీ పరంగా అక్కడి సెన్సార్ల వ్యవస్థ బాగానే ఉన్నా.. డిజాస్టర్ పరంగా బెంగళూరు మేనేజ్మెంట్ సక్సెస్ కాలేదని అధికారులు అంటున్నారు. గ్రేటర్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో గతంలో పనిచేసిన అధికారులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బందితో క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుందో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నట్లు తెలిసింది. గతంలో కర్ణాటక ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్‌లో డిజాస్టర్ మేనేజ్మెంట్ను చూసి వెళ్లారు. బెంగళూరు కంటే ఇక్కడే బాగుందంటూ కితాబు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు హైడ్రాకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతగా నచ్చిందంటే కారణమేమిటోనన్న చర్చ జరుగుతోంది.