కాప్రా, నవంబర్ 18: సర్కిల్ పరిధిలోని వర్తక వాణిజ్య సంస్థలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, ఇతరత్రా సంస్థలు తమ వ్యాపార నిర్వహణకు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ నుంచి ‘ట్రేడ్ లైసెన్సు’ను కలిగి ఉండాలని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో డీసీ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వ్యాపార సంస్థ ట్రేడ్ లైసెన్సు కలిగి ఉండేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టిందని తెలిపారు. ‘జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సు యాప్’ద్వారా దుకాణాలు నిర్వహించేవారు ఇకపై సులువుగా ట్రేడ్ లైసెన్సులు పొందవచ్చని వెల్లడించారు.
సర్కిల్ పరిధిలో ఏఎంఓహెచ్, అసిస్టెంట్ లైసెన్సింగ్ అధికారి, శానిటరీ సూపర్ వైజర్, జవాన్, ఎస్ఎఫ్ఓలు వారి పరిధిలో ట్రేడ్ లైసెన్సులు లేని దుకాణాలు, సంస్థలను గుర్తించి వాటి నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ యాప్ ద్వారా లైసెన్సు పొందేందుకు అవగాహన కలిగిస్తారని, ఈ కార్యక్రమం గత కొంతకాలం నుంచి జరుగుతోందన్నారు. సదరు వ్యాపార సంస్థల నిర్వాహకులు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి సహకరించి వారు ట్రేడ్ లైసెన్సులు పొందేందుకు సహకరించాలని డీసీ కోరారు. ట్రేడ్ లైసెన్సులను తమ సంస్థలో తప్పని సరిగా ప్రదర్శించాల్సి (‘డిస్ప్లే’) ఉంటుందని అన్నారు. ట్రేడ్ లైసెన్సు లేకుండా ఎవరూ వ్యాపారం చేయవద్దని సూచించారు.
కాప్రా సర్కిల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,351 ట్రేడ్ లైసెన్సులను జారీ చేసినట్టు డీసీ శంకర్ తెలిపారు. వీటి ద్వారా రూ.2.20 కోట్లు లైసెన్సు ఫీజు రూపంలో సర్కిల్‌కు ఆదాయం లభించినట్టు తెలిపారు. మరో 1,500 ట్రేడ్ లైసెన్సులు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ‘ట్రేడ్ లైసెన్సు యాప్’ ద్వారా లైసెన్సు జారీ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడే అధికారులు, సిబ్బందిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీసీ హెచ్చరించారు.