సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఫార్ములా – ఈ కారు రేసింగ్ ఈవెంట్ హుస్సేన్ సాగర్ రూపురేఖలను మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడల్లో ఒకటైన కార్ల రేసింగ్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుండడంతో దానికి అనుగుణంగానే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ తీరంలో లుంబినీ పార్కు, సచివాలయం, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్, ఐమ్యాక్స్, నెక్లస్ రోడ్డు… ఇలా వీటన్నింటినీ చుట్టు ముట్టేస్తూ నిర్మిస్తున్న ఫార్ములా -ఈ కారు రేసింగ్ మార్గం సరికొత్త ఆకర్షణగా మారుతోంది. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తి కాగా, రాత్రింబవళ్లు ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి. ఒకేసారి ప్రపంచంలోని 13 దేశాల్లోని ముఖ్య నగరాల్లో జరుగుతున్న ఫార్ములా -ఈ కార్ రేసింగ్ హైదరాబాద్‌లోనూ వచ్చే ఏడాది ఫిబ్రవరి11 జరుగనుంది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్ రేసింగ్ పోటీల నిర్వహణలో ఇంటర్నేషనల్ ఆటో మొబైల్ ఫెడరేషన్ (ఎఫ్ఐఏ) సంస్థ ఫార్ములా -ఈ కార్ రేసింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. అత్యంత వేగంగా దూసుకువెళ్లే మోటార్ కార్లను దృష్టి పెట్టుకొని నిర్ధేశిత మార్గాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్ములా-ఈ రేసింగ్ ట్రాక్‌ను మాత్రమే కాకుండా ఆ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను అత్యాధునిక శైలిలో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఐమ్యాక్స్ పక్కన ఉన్న సుమారు 11 ఎకరాల స్థలాన్ని సైతం ఫార్ములా -ఈ ట్రాక్ నిర్మాణానికి, ఆ తర్వాత పోటీలు నిర్వహించే సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ అహర్నిశలు శ్రమిస్తోంది. భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న కార్ రేసింగ్ పోటీలకు హైదరాబాద్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరితో పాటు వరుసగా మరో నాలుగేండ్ల పాటు ఫార్ములా-ఈ కారు రేసింగ్ పోటీలు నిర్వహించేందుకు ఎంపిక చేశారు. దీంతో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ప్రపంచ స్థాయిలో ఉండేలా ట్రాక్ నిర్మాణం పనులను, తర్వాత పోటీల సమయంలో చేయాల్సిన ఏర్పాట్లను హెచ్ఎండీఏ అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.