అమీర్పేట్, నవంబర్ 9 : సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తేనే సానుకూల ఫలితాలు వస్తాయని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో సనత్నగర్ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కార్తిక వన సమారాధన, బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించారు. ఈ వేడుకలకు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ మాజీ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో పాటు కార్పొరేటర్లు కొలను లక్ష్మి రెడ్డి, శ్రవణ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… తమ సమస్యల పరిష్కారానికి బ్రాహ్మణులంతా కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే సానుకూల ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులంతా కలిసి సహాఫంక్తి భోజనాలు చేశారు. అనంతరం జరిగిన సమాఖ్య సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ ప్రధానార్చకులు పరాశరం రవీంద్రాచార్యులు పలు పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అలాగే వనస్థలిపురానికి చెందిన డాక్టర్ చింతలపాటి శూలరాణి శిష్య బృందం పౌరాణిక పద్యనాటకం శ్రీ కృష్ణ రాయభారం, మైలవరపు శ్రీవల్లీ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో సమాఖ్య ఉపాధ్యక్షులు రెండుచింతల రామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి గొంగులూరి విజయలక్ష్మి, కోశాధికారి ఆదుర్తి పంచగంగేశ్వర్, సంయుక్త కార్యదర్శి పులిపాక రవీంద్ర, కార్యవర్గ సభ్యులు యు.పి.సోమయాజులు, ఎం.ఉపేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.