హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో పౌర సమాజం బలంగా ప్రశ్నించడం వల్లే మీడియాలో ఆ మాత్రమైనా వార్తలు వచ్చాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో శాసనమండలిలో ఆంధ్ర పాలకుల కుయక్తులను స్వయంగా చూశానని, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమైందని పేర్కొన్నారు. అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం, తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మీడియా గతం- వర్తమానం-భవిష్యత్తు’ అన్న అంశంపై రెండు రోజులపాటు జరిగిన జాతీయ సెమినార్ ఆదివారం ముగిసింది.
ప్రొఫెసర్ నాగేశ్వర్, సాక్షి దినపత్రిక సంపాదకుడు వర్ధెల్లి మురళి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. మీడియాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం లేదని అన్నారు. సంపాదకుడు వర్ధెల్లి మురళి మాట్లాడుతూ.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మీడియాలో చర్చ జరగడం లేదని, ప్రజాప్రయోజనాలకే మీడియా పెద్దపీట వేయాలని సూచించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. అకాడమీ ఆధ్వర్యంలో పాత్రికేయులకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీశాట్ సీఈవో శైలేశ్‌రెడ్డి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ కొణతం దిలీప్, సీఈవో రాకేశ్, డాక్టర్ కంచన్ కౌర్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ సుధాకర్‌రెడ్డి, స్పెషల్ రిపోర్ట్స్ ఎడిటర్ సుశీల్‌రావు, ప్రొఫెసర్లు శ్రీనివాస్, సత్తిరెడ్డి, యాదగిరి, సునీల్, కృష్ణారావు, పద్మజా షా, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, ఎన్.వేణుగోపాల్, ఎల్వీకే రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ప్రొడ్యూసర్ ఉదయిని, కవి, రచయిత వారాల ఆనంద్, మంజులా గ్లోరీ, ఉమ తదితరులు పాల్గొన్నారు.