సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): గోవా నుంచి వస్తున్న డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్-న్యూ) పోలీసులు.. తాజాగా డ్రగ్స్ సరఫరాకు అవకాశం ఉన్న ముంబై, బెంగళూర్‌పై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌కు గోవా, ముంబై, బెంగళూర్ నుంచి తరచూ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు హెచ్ న్యూ అధికారులు గుర్తించారు. ఎక్కువగా గోవా నుంచే సరఫరా అవుతున్నట్టు పలు కేసుల దర్యాప్తుల్లో వెల్లడైంది. గోవాలో దాదాపు మూడు నెలల పాటు నిఘా పెట్టి, ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహించిన హెచ్ న్యూ పోలీసులు అక్కడి డ్రగ్స్ మాఫీయాలో వణుకు పుట్టించారు. కింగ్ పిన్‌లను అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అంటేనే అక్కడి నేరగాళ్లు భయంతో వణికిపోతున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హెచ్ న్యూ పోలీసు అధికారులు పాత నేరగాళ్లపై నిఘా పెట్టారు. గతంలో, ఇటీవల అరెస్టయిన నేరగాళ్ల చిట్టాను పరిశీలిస్తున్నారు. వారి మూలాలపై అధ్యయనం చేస్తున్నారు. గోవాతో పాటు ఇతర ఏయే ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారితోపాటు వినియోగదారులపై కూడా నిఘా కొనసాగుతున్నదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వినియోగదారుల ద్వారా కూడా డ్రగ్స్ వచ్చే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. అందువల్లే ప్రస్తుతం అన్ని మార్గాలు, మూలాలపై నిఘా పెట్టినట్టు తెలిపారు.
హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నేరగాళ్లతో పాటు వారికి అక్కడ డ్రగ్స్ అందిస్తున్న వారిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఆఫ్రికాకు చెందిన పలువురు వివిధ మార్గాల్లో భారత దేశంలోకి వచ్చి.. తమ పాస్‌పోర్టు గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉంటున్నారని, ఎక్కువ శాతం ముంబై, గోవాలో తిష్టవేస్తున్న నేరగాళ్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిపై నిఘా పెట్టిన హెచ్ న్యూ చర్యలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలిసింది.
డ్రగ్స్ సరఫరా దారు టోనీని అరెస్ట్ చేసి, పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. టోనీకి డ్రగ్స్ సరఫరా చేసిందెవరూ.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టగా.. స్టార్ భాయ్ అని తేలింది. నైజీరియాకు చెందిన చికేజీ ఓర్జీ అలియాస్ స్టార్ భాయ్ 2013లో జాబ్ వీసాపై ఇండియాకు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రగ్స్ సరఫరా చేస్తూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత, డ్రగ్స్ సరఫరాలో కింగ్ పిన్‌గా మారాడు. అతడు గతంలో అరెస్టయిన సమయంలో పోలీసులు పాస్‌పోర్టును సీజ్ చేశారు. అయితే, అతడు దేశంలో ఉండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడా.?
ఇతర దేశాల నుంచి డ్రగ్ సరఫరా చేస్తున్నాడా..! అనే అంశంపై హెచ్‌న్యూ దృష్టి పెట్టింది. నకిలీ పాస్ పోర్టు, సముద్ర మార్గంలో అక్రమంగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో అతడి గూర్చి పోలీసులు ఆరా తీస్తున్నారు. దేశం విడిచి వెళ్లిపోతే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసి, నిందితుడిని ఎలాగైనా పట్టుకోవాలనే లక్ష్యంతో హెచ్‌న్యూ అడుగులు వేస్తున్నది.