మేడ్చల్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండంతో 8 నెలల కాలంలోనే రూ. 240 కోట్ల పెట్టుబడులతో 570 పరిశ్రమలు ఏర్పడ్డాయి. దీంతో 7వేల పైచిలుకు మందికి వివిధ రకాల ఉపాధి అవకాశాలు లభించాయి.
పారిశ్రామిక పెట్టుబడి ప్రొత్సాహక విధానం ద్వారా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వివిధ రాయితీలను అందిస్తున్నది. పరిశ్రమలు ఏర్పాటు చేసిన జనరల్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి, పావల వడ్డీ, పన్నులు, విద్యుత్ చార్జీల రాయితీలను పరిశ్రమల ఆధారంగా అందిస్తున్నది. టీ ఐడియా పథకం కింద ఇప్పటి వరకు 3,364 మంది పారిశ్రామికవేత్తలకు రూ. 328 కోట్లు, టీ ప్రైడ్ పథకం కింద 2035 మంది పారిశ్రామికవేత్తలకు రూ.210 కోట్ల రాయితీలను అందించింది. జిల్లా వ్యాప్తంగా 9859 పరిశ్రమలు ఉండగా ఇందులో మెగా పరిశ్రమలు 11 ఉండగా 60 భారీ పరిశ్రమలు, మధ్య తరహా 98, సూక్ష్మ 4,316, చిన్న తరహా పరిశ్రమలు 4812 ఉన్నాయి. పరిశ్రమలలో 2,14,296 మంది ఉపాధి పొందుతున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐఐసీకి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. అన్ని అనుమతులు వచ్చిన పరిశ్రమలకు టీఎస్ఐఐసీ నిబంధనల మేరకు స్థలాలను కేటాయిస్తుంది. జిల్లాలో అనేక పారిశ్రామికవాడలు ఉన్నప్పటికీ పరిశ్రమల ఏర్పాటుకు వస్తున్న డిమాండ్ మేరకు టీఎస్ఐఐసీ భూ సేకరణ చేస్తున్నది. ఇటీవలె ఘట్కేసర్ మండలం మాదారం గ్రామంలోని 225 సర్వే నెంబర్లో 171 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి టీఎస్ఐఐసీకి రెవెన్యూ అధికారులు అప్పగించారు. దీంతో 171 ఎకరాలలో వందల పైచిలుకు పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది.
పరిశ్రమల ఏర్పాటులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉంది. రూ. 15367.03 కోట్ల పెట్టుబడులతో 9,859 పరిశ్రమలను పారిశ్రామికవేత్తలు నెలకొల్పారు. మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర పారిశ్రామిక స్వీయ ధ్రువీకరణ విధాన 2014 చట్టం ప్రకారం అనుమతులను త్వరితగతిన మంజూరు చేస్తున్నాం. పరిశ్రమలకు రావాల్సిన రాయితీలపై ప్రభుత్వానికి ఎప్పటి కప్పుడు ప్రతిపాదనలను సమర్పిస్తున్నాం.
– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, పరిశ్రమల కేంద్రం మేనేజర్ రవీందర్