Hyderabad Zoo | చాంద్రాయణగుట్ట, మార్చి 5 : వేసవికాలం ప్రారంభమై ఎండలు మండుతున్న నేపథ్యంలో నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్కులో జంతువులకు చల్లని తాటాకు పందిళ్లను వేయడానికి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. సందర్శకులకు కూడా వేసవి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జూపార్కులో ఉన్న జంతువుల సంరక్షణ కోసం అధికారులు.. కాలానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ వేసవికాలంలో ఎండలు ముదరడంతో అధికారులు అప్పుడే పనులను ప్రారంభించారు. జూపార్క్‌లో ఉన్న అన్ని ఎన్క్లోజర్లలో తాటాకు పందిళ్ళు, అవసరమైన ప్రాంతాల్లో స్ప్రింక్లర్స్, నీటితో కడగడం, కూలర్ల ఏర్పాటు, అంతర్గత గదులు, చీకటి గదులలో ఏసీల ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జంతువుల హాస్పిటల్ ఏరియాలలో చల్లగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నారు.
జూక్యురేటర్ వసంత నేతృత్వంలో అధికారులు ఈ వేసవి చర్యల ప్రణాళికలను చేపడుతున్నారు. ఎండలు ఇప్పటికే ముదురుతుండడంతో అధికారులు జూపార్క్‌లోని సింహాలు, పులులు, పాములు, మొసళ్లు, జింకలు తదితర ఎన్క్లోజర్లలో తాటాకు పందిళ్ళ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలోగతంలో ఉన్న తాటాకులను తొలగించి నూతనంగా పచ్చని తాటాకులు ఏర్పాటు చేయడం, ఏనుగులను కడిగేందుకు, సింహాలకు వేడి తగలకుండా ఉండేందుకుగాను కూలర్లు, ఏసీల ఏర్పాటు వంటి పనులను చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఈ పనులను ప్రారంభించే వారు కానీ ఈ సంవత్సరం మార్చి నెలలో ఎండలు ముదరడం వలన పనులు ప్రారంభించారు.
నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు వేసవికాలం వచ్చిందంటే సందర్శకుల తాకిడి అధికమవుతుంది. అయితే ఈసారి ఎండలు అధికంగా ఉండటం వలన సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జూపార్క్ అధికారులు టికెట్ కౌంటర్ వద్ద ఎన్క్లోజర్లలో తిరిగే సమయంలో ఎలాంటి ఎండ తగలకుండా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సందర్శకులకు వేసవి సహాయక చర్యలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఎండలు అధికంగా ఉండేవి కానీ ఈ సంవత్సరం మార్చి మాసంలోనే ఎండలు ముదరడం వలన అధికారులు ముందస్తుగా వేసవి ప్రణాళికలను ప్రారంభించారు. పెరిగే సందర్శకుల సౌకర్యార్థం పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని తాటాకు పందిళ్ళ ఏర్పాటుకు పనులు సాగుతున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు.