దుండిగల్: దుండిగల్ పరిధి తండా-2లో జరిగిన మహిళా హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. జెరుపుల శాంతి (45) దుండిగల్ తండా-2లో నివాసముంటున్నది. వరంగల్ జిల్లా హన్మకొండ సుబేదారికి చెందిన రావుల కమల్‌కుమార్(37) ఓ పరిశ్రమలో పనిచేస్తూ.. శాంతి ఇంటి పక్కనే అద్దెకుంటున్నాడు. ఈనెల 21న తన ఫోన్ చార్జర్ కనిపించకపోవడంతో శాంతితో కమల్ గొడవపడ్డాడు. 23న మరోసారి ఆమె ఇంటికి వెళ్లి ఘర్షణపడ్డాడు.
తాను చార్జర్ తీయలేదంటూ.. కమల్కుమార్ను దుర్భాషలాడింది. ఆగ్రహానికి గురైన కమల్‌కుమార్ శాంతిని బలంగా నెట్టడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. గాయాలతో అర్తనాదాలు చేయడంతో భయంతో కమల్ ఆమె నోరు, ముక్కును చేతులతో మూసివేయడంతో ఊపిరాడక చనిపోయింది. సీసీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కమల్కుమార్ను విచారించారు. అతడు నేరాన్ని అంగీకరించడంతో అరెస్టు చేశారు.