సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో మరింత పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధిని కొనసాగిస్తున్నది. సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5112.36కోట్ల అంచనా వ్యయంతో 48 ప్రాజెక్టులు చేపట్టగా.. ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 19 ఫ్లై ఓవర్లు, 5 అండర్‌పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో 3 ఇతర పనులను పూర్తి చేశారు. తాజాగా వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వెళ్లే రహదారిలో 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జిని కూడా శనివారం అందుబాటులోకి తీసుకురానున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ వంతెనను ప్రారంభించనున్నారు.
కవాడిగూడ, ఆగస్టు 18 : నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇందిరాపార్కు వద్ద ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఇతర శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఇందిరాపార్కు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, వీఎస్టీ జంక్షన్లలో వాహనాల రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, సమస్యను పరిష్కరించేందుకు 2.62 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జిని నిర్మించినట్లు తెలిపారు. ఈ బ్రిడ్జికి తెలంగాణ తొలి హోంమంత్రి స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. త్వరలోనే మూసీ నది అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటే ఒక్క రూపాయి తేలేనోళ్లు, అధికారంలో ఉన్ననాడు ప్రజల బాగోగులను విస్మరించినోళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు.
ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి నాలుగున్నర సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ నార్త్‌జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్, సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్ రాజు, ఈఈ గోపాల్, డీఈఈలు సుదర్శన్, రేణుక, ఏఈఈ సాయికృష్ణ, గ్రేటర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ముఠా జయసింహ, ఏసీపీలు ఎ.యాదగిరి, రత్నం, దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.