Foot Path | సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారిలోని ఫుట్‌పాత్‌లు, క్యారేజ్ వేలను ఆక్రమిస్తూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కల్గించడమే కాకుండా.., పాదచారులు ఫుట్‌పాత్‌పై నడిచేందుకు వీలు లేకుండా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆపరేషన్ రోప్ (రిమూవల్ ఆఫ్ ఆబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్)ను ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. బయట ఫుట్‌పాత్‌లను క్లీన్ చేయడానికి ముందే, తమ ఠాణాల ముందు ఫుట్‌పాత్‌లు సరిగ్గా ఉన్నాయా? ఆ ఫుట్‌పాత్‌లపై ప్రజలు నడిచేందుకు అవకాశముందా? ఠాణాలకు వచ్చే వారు వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారు? పార్కింగ్ సౌకర్యం ఉందా? అనే విషయాలు కూడా ఆలోచించాల్సిన అవసరముంది.
అయితే, నగరంలోని ప్రధాన రహదారుల వెంబడి ఉన్న ఠాణాల ముందు వాహనాలు పార్కింగ్ చేసే సౌకర్యం చాలా వాటికి లేదు. దీంతో చాలా ఠాణాల ముందు వాహనాలను రోడ్డుపై ఫుట్‌పాత్‌పైనే పార్కింగ్ చేస్తుంటారు. ఇటూ శాంతి భద్రతలు, అటూ ట్రాఫిక్ ఠాణాల ముందు ఈ పరిస్థితి ఉంది. చాలా పోలీస్స్టేషన్లలో వెనుక కొంత స్థలం పార్కింగ్ కోసం ఉన్నా, చాలా మంది బయటే వాహనాలు పార్కు చేస్తుంటారు. మరికొన్ని చోట్ల ఠాణా సిబ్బంది తమ వాహనాలను లోపల ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో పార్కు చేసుకుంటే, ఠాణాకు వచ్చిన వారితో ఠాణా ముందు రోడ్డు వాహనాలతో నిండి ఉంటుంది. ఇలా రద్దీలేని ప్రాంతాలే కాకుండా నిత్యం రద్దీగా ఉంటే రోడ్లపై ఉన్న ఠాణాల వద్ద పరిస్థితి ఇది.
పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ముందు ఒక వైపు పూర్తిగా ఫుట్‌పాత్‌ను పోలీసులు ఆక్రమించేశారు. రాంగ్ పార్కింగ్‌లలో వాహనాలు నిలిపితే ఆయా వాహనాలను క్రేన్ సహాయంతో తెచ్చి ఇక్కడే పార్కు చేస్తుంటారు. ఈ చౌరస్తాలో ఫుట్‌పాత్ పూర్తిగా ఆక్రమించేశారు. ఇదే ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని గమనించడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. మధురానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మారేడ్‌పల్లి, లంగర్‌హౌస్, హుమాయూన్‌నగర్, హబీబ్‌నగర్, ఆసిఫ్‌నగర్ ఇలా పలు లా అండ్ ఆర్డర్ పోలీస్స్టేషన్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు పేర్కొంటున్నారు.
రద్దీగా ఉండే చాదర్‌ఘాట్ చౌరస్తాలో ఠాణా ముందు జాగలేదు. పక్కనే వాహనాలను పార్కు చేస్తారు. ఇక్కడకు వచ్చిపోయే వారు, తరుచు పోలీసులు రోడ్డు పక్కన వాహనాలను పార్కు చేస్తుండటంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇలా నగరంలోని పలు పోలీస్స్టేషన్ల వద్ద పార్కింగ్ స్థలాలు సరిగ్గా లేకపోవడంతో వాహనాలన్ని ఫుట్‌పాత్‌లు, రోడ్లపైనే పెడుతున్నారు. హైదరాబాద్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయం, ప్రస్తుత సీసీఎస్ భవనం వద్ద కూడా సరైన పార్కింగ్ సౌకర్యం లేదు. ఇక్కడ వాహనాలన్ని నిజాం కాలేజీ గోడకు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌లపై పార్కింగ్ చేస్తుంటాయి.
చౌరస్తాలో ఉన్న ఆలయం ముందు ఉన్న ప్లేస్ అంతా పార్కింగ్‌కే ఉపయోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే వాహనాలతో బీఆర్కే భవన్ వైపున్న రోడ్డంతా జామై ఉంటుంది. వీటికి తోడు బడా హోటల్స్, బార్లు, మద్యం దుకాణాల ముందు రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న పబ్‌ల వద్ద పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనాలన్ని రోడ్లపై బారులు తీరి ఉంటాయి. ఇక్కడ రాత్రి వేళల్లో నడిచేందుకే కాదు.., సాధారణ వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు అనేకం ఉంటాయి.
నగరంలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చేపట్టిన రోప్ మంచి కార్యక్రమమే. ఫుట్‌పాత్ వ్యాపారాలు చేయడం ఒక మాఫియా మారింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారితో చాలా చోట్ల ఫుట్‌పాత్‌లు నిండిపోయాయి. కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లను స్థానికంగా ఉండే నాయకులు కబ్జా చేస్తూ దానిని చిరు వ్యాపారులకు కిరాయికి ఇస్తూ నెలవారి కిరాయి వసూలు చేస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ కష్టాలలో ఫుట్‌పాత్ ఆక్రమణలు ప్రధానమైందే. కాని, పోలీస్ ఠాణాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏ మేర పార్కింగ్ సౌకర్యాలున్నాయి? అక్కడకు వచ్చేవారు ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్నారా? అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరముంది. ఆపరేషన్ రోప్ అంటూ హడావిడి చేస్తూ స్థానిక పోలీసులు అక్కడక్కడ అధికారుల మెప్పు పొందేందుకు తాపత్రయ పడుతుంటారు. పూర్తిస్థాయిలో ఆయా ఠాణాల పరిధిలో రోప్‌ను అమలు చేస్తే ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుందని నగరవాసులు సూచిస్తున్నారు.
బేగంపేట్ నవంబర్ 28: సికింద్రాబాద్ బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఫుట్‌పాత్ ఆక్రమణలను గురువారం తొలగించారు. బేగంపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాపయ్య ఆధ్వర్యంలో ఫుట్‌పాత్ ఆక్రమణలు నిర్వహించారు. బేగంపేట్ కిమ్స్, ఆసుపత్రి రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలైన బడ్డీ కొట్లు, చాయ్బండి, టిఫిన్ బండ్లు ఇతర చిరు వ్యాపారాలను పూర్తిగా తొలగించారు. అలాగే, పార్కులైన్ సెంటర్ నుంచి ప్యారడైజ్ వరకు ఆక్రమణలను తొలగించారు. ఈ తొలగింపు కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, బేగంపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డును, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ ఆటంకాలు కలిగిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.