Hyderabad | బంజారాహిల్స్, మార్చి 14 : తన బైక్‌కు ఎలా చలానా వేస్తారంటూ ట్రాఫిక్ పోలీసు విభాగం నిర్వహిస్తున్న యాప్‌లో అత్యంత తీవ్రమైన పదజాలంతో దూషించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. రామంతపూర్‌లోని సత్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎర్ర నర్సింహులు పేరుతో ఉన్న పల్సర్ బైక్‌కు ఇటీవల రాంగ్ పార్కింగ్ పేరుతో ట్రాఫిక్ చలానా పడింది. దీంతో రాంగ్ చలానా వేశారంటూ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే ‘రిపోర్ట్ అస్’ యాప్‌లో నర్సింహులు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో భాగంగా అత్యంత అసభ్యకరమైన భాషలో బూతులు తిట్టడంతోపాటు, తాను రాంగ్ పార్కింగ్ చేయలేదని మెసేజ్‌లో పేర్కొన్నాడు.
కాగా ఈ ఫిర్యాదును పరిశీలించిన ట్రాఫిక్ హోంగార్డు మెహతాబ్ అహ్మద్ చలానా సరైనదే అని తేల్చారు. రాంగ్ పార్కింగ్‌లో బైక్ పార్క్ చేయడమే కాకుండా రిపోర్ట్ అస్ యాప్‌ను ఉపయోగించుకుని తప్పుడు ఫిర్యాదు చేయడం, బూతులతో మెసేజ్‌లు పెట్టడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకునేందుకు యత్నిస్తున్న నర్సింహులు మీద చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్లోని ట్రాఫిక్ ఈ చలానా విభాగం ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ 223(ఏ), 224, 351(2),(3), 352తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.