సిటీ బ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): న్యూఇయర్ మరి కొద్దిగంటల్లో రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం కొత్త సంవత్సర వేడుకల ఆంబరాల్లో మునిగితేలుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. బేగంపేట, టోలిచౌకి ఫ్లైఓవర్లు మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ నేటిరాత్రి పది గంటల నుంచి నుంచి జనవరి1వ తేదీ ఉదయం వరకు అవసరాన్ని బట్టి బంద్ చేస్తామని, అన్ని ప్రైవేటు వాహనాలు సిటీలోకి రాకుండా ఓఆర్ఆర్మీదుగా వెళ్లాలని ఇన్చార్జి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ వంటి చోట్ల రాత్రి 11 గంటల నుంచి 1వ తేదీ తెల్లవారుజామున రెండుగంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. 217 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారని, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ ఉన్నచోట ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి ఎనిమిది గంటలనుంచే కొనసాగుతాయని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్,ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.