సుల్తాన్ బజార్, జూన్ 11: ద్విచక్ర వాహనాల దొంగతనానికి అలవాటుపడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన నాలుగు దిచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి (24) 8వ తరగతి చదువుకున్నాడు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి సంతోష్‌నగర్‌లో నివసిస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో సుభాన్ బేకరి, రేతిబోలి, మిలలో కేక్ తయారీదారుడిగా పనిచేస్తూ నెలకు రూ.50వేల వరకు జీతం అందుకునేవాడు. సంపాదన ఎక్కువగా ఉండటంతో దస్తగిరి బెట్టింగ్ గేమ్‌లకు అలవాటుపడ్డాడు. ఆ బెట్టింగ్‌ల్లో లక్షల రూపాయలు నష్టపోయాడు. దీంతో ఆ డబ్బును సంపాదించేందుకు బైక్ దొంగలించి అమ్మాడు. దొరక్కపోవడంతో బైక్‌లను దొంగతనం చేసి బెట్టింగ్‌లు ఆడటం అలవాటుగా మార్చుకున్నాడు. అలా విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ దస్తగిరి సుల్తాన్‌బజార్, బోరబండ, చిలకలగూడ, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి విక్రయించాడు. ఈ క్రమంలో నిఘా పెట్టిన హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు బుధవారం నాడు దస్తగిరిని పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.