శేరిలింగంపల్లి, ఆగస్టు 25 : కొండాపూర్‌లో రేవ్‌పార్టీపై ఈగల్ టీం, గచ్చిబౌలి పోలీసులు దాడిచేశారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లతో పాటు ఓ సప్లమ్దారుడు, ముగ్గురు కన్జుమ్యర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల 8 ఎక్టసీ పిల్స్, 3 గ్రాముల ఎండీఎంఎను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలను సోమవారం మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏపీ తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం మండలం, వెడిరేశ్వరం గ్రామానికి చెందిన తేజ, ఇదే ప్రాంతం జొన్నడ గ్రామానికి చెందిన విక్రమ్ నగరంలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నారు.
క్లౌడ్ కిచెన్ వ్యాపారం నిర్వహించిన తేజకు నార్సింగి ప్రాంతానికి చెందిన మన్నె నీలిమా, విక్రమ్‌లతో ఏర్పడిన పరిచయంతో కొంతకాలంగా ముగ్గురు స్నేహితులుగా ఉంటున్నారు. వీరు డ్రగ్స్‌కు అలవాటుపడి కలిసి పార్టీలకు వెళ్తుంటారు. ఇందులో భాగంగా బెంగళూర్, రాజమండ్రి, గోవా ప్రాంతాల్లో డ్రగ్స్‌తో కూడిన రేవ్పార్టీలకు సైతం హాజరయ్యారు. కొంతకాలం తర్వాత తేజ, నీలిమాలు సైతం రేవ్‌పార్టీలు నిర్వహించడం ప్రారంభించారు. ఆదివారం కొండాపూర్ రాజేశ్వరి నిలయంలోని సర్వీస్ అపార్టుమెంట్‌ను అద్దెకు తీసుకొని రేవ్‌పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి బెంగళూర్‌లో ఇంజినీరింగ్ చదువుతూ డ్రగ్స్ సప్లయర్‌గా ఉన్న చందన్ డ్రగ్స్ తీసుకొని వచ్చారు.
డ్రగ్ పెడ్లర్స్ తేజ, నీలిమాలు, సప్లయర్ చందన్లతో విక్రమ్, కొండాపూర్ రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన వైన్‌షాప్ వ్యాపారి పురుషోత్తం రెడ్డి, కొండాపూర్ సైబర్మిడోస్కు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ భార్గవ్ రేవ్‌పార్టీకి హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్టీం, గచ్చిబౌలి పోలీసులు రేవ్‌పార్టీపై ఆదివారం రాత్రి దాడిచేసి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల 8 ఎక్టసీ పిల్స్, 3 గ్రాముల ఎండీఎంఎను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. సప్లయర్ చందన్‌కు బెంగళూర్‌కు చెందిన రాహుల్ డ్రగ్స్ విక్రయించినట్లు విచారణలో తెలిసిందన్నారు.
గతంలో తేజ, నీలిమా, విక్రమ్‌లు 2024 న్యూయర్ వేడుకల్లో భాగంగా రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్‌కు చెందిన ఫామ్‌హౌజ్ (రాజమండ్రి)లో డ్రగ్స్‌తో కూడిన రేవ్‌పార్టీలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. చర్మ సౌందర్యం కోసం వాడే గ్లూటాక్స్ ఇంజెక్షన్లలో మందుకు బదులుగా కొకైన్‌ను కలిపి ఇంజక్షన్ల రూపంలో వాడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. తేజ, విక్రమ్, మన్నె నీలిమా, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్‌లను అరెస్టుచేయగా రాహుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏసీపీ శ్రీధర్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ పాల్గొన్నారు.