హైదరాబాద్ : రాష్ట్రమంతటా జూన్ మాసంలోనే నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు బాగానే కురిశాయి. కానీ రాజధాని హైదరాబాద్ నగరంలో మాత్రం గతేడాదితో పోల్చితే 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కే నాగరత్న వెల్లడించారు. జూన్ నెలలో తెలంగాణలో 56 శాతం వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. జులై మాసంలో వర్షాలు ఎలా ఉంటాయో చూడాలన్నారు. జూన్ నెల ప్రారంభం నుంచి నిన్నటి వరకు హైదరాబాద్లో 133.2 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. మంగళవారం రోజు హైదరాబాద్లో 34.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వచ్చే వారం రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.