సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): శంకర్పల్లి దారిదోపిడీ మిస్టరీని 24 గంటల్లోనే సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ కేసులో దోపిడీకి ప్రధాన సూత్రదారి అయిన కారు డ్రైవర్‌తో పాటు అతడికి సహకరించి, దోపిడీకి పాల్పడిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.17లక్షల 50వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అవినాష్ మహంతి, రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్, బాలానగర్ డీసీపీ సురేష్‌కుమార్, క్రైమ్ డీసీపీ ముత్యంరెడ్డి, ఇతర అధికారులతో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
నగరానికి చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ వద్ద సాయిబాబా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకునే సాయిబాబా యజమాని సూచన మేరకు వివిధ ప్రాంతాలకు వెళ్లి కస్టమర్ల నుంచి లావాదేవీలకు సంబంధించిన డబ్బులు కలెక్ట్ చేస్తాడు. ఇందుకోసం ఎల్బీనగర్కు చెందిన కాసుల మధు కారును బుక్ చేసుకుని వెళ్తుంటాడు. సంవత్సర కాలంగా మేనేజర్ సాయిబాబా ఎక్కడికి వెళ్లినా మధు కారును బుక్‌చేసుకుని అతడి కారులోనే డబ్బులను తీసుకొస్తుంటాడు.
సంవత్సరం కాలంగా నమ్మకంగా వ్యవహరించడంతో ఎప్పటిలాగే ఈనెల 12న కూడా వికారాబాద్‌కు వెళ్లడానికి మధు కారును ఒక రోజు ముందే బుక్ చేసుకున్నాడు. అయితే సాయిబాబా తరచూ డబ్బులు తీసుకొస్తుండడాన్ని గమనించిన కారు డ్రైవర్ మధు ఎలాగైన ఆ డబ్బును దోచుకోవాలని పథకం పన్నాడు. వెంటనే విషయాన్ని తన స్నేహితులైన ఆర్సీపురం ప్రాంతానికి చెందిన తెలపురం విజయ్‌కుమార్, కాచిగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అజర్లకు వివరించి 12న చేయాల్సిన దోపిడీ గురించి వివరించాడు. దీంతో విజయ్‌కుమార్ దోపిడీ కోసం పాత నేరస్తుడైన గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన సలిన్ హర్షవర్థన్‌ను సంప్రదించాడు.
వెంటనే మధు, విజయ్‌కుమార్, హర్షవర్ధన్, అజార్‌లు కలిసి వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే దారిలో దోపిడీ చేయడానికి రెక్కీ నిర్వహించి, శంకర్పల్లి పరిధిలోని హుస్సేయిన్పూర్ గేట్ వద్ద నిర్మానుష్య ప్రదేశాన్ని స్పాట్‌గా నిర్ణయించుకున్నారు. దోపిడీ కోసం హర్షవర్ధన్ తన స్నేహితుడైన జడ్చర్ల నివాసి అనుదీప్ అలియాస్ లడ్డు కారును తీసున్నాడు. అంతే కాకుండా మరో ఇద్దరు పాత స్నేహితులైన దీపక్, షమీయుల్లాల సహాయం తీసుకున్నాడు.
దోపిడీకి పాల్పడే ముఠా ఒక కారులో దాని వెనకాల ఎస్కార్గా మరో కారులో విజయ్‌కుమార్, అజార్‌లు వెళ్లాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. పథకం ప్రకారం ఈనెల 12న మధు ఎప్పటిలాగే సాయిబాబాను నగరం నుంచి వికారాబాద్‌కు తన కారులో తీసుకెళ్లాడు. అక్కడ కస్టమర్ నుంచి డబ్బులు తీసుకున్న తరువాత సాయిబాబాతో కలిసి నగరానికి తిరుగు పయణమయ్యాడు. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం కారు డ్రైవర్ మధు ఎప్పటికప్పుడు లైవ్ లోకేషన్‌ను స్నేహితులకు చేరవేస్తూ వారితో టచ్‌లోనే ఉన్నాడు.
ముందస్తు పథకం ప్రకారం సాయిబాబా ప్రయాణిస్తున్న కారు హుస్సేయిన్పూర్కు చేరుకోగానే అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న హర్షవర్థన్ తన కారుకు ఇండికేటర్లు వేయడంతో మధు దోపిడీ చేయడానికి అనుకూలంగా ఉండేందుకు కారు వేగాన్ని తగ్గించాడు. వెంటనే హర్షవర్ధన్ తన కారుతో వచ్చి సాయిబాబా ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, సాయిబాబాపై దాడి చేసి, అతని వద్ద ఉన్న రూ.40లక్షల నగదును దోచుకుని కారులో పారిపోయారు. కొంతదూరం వెళ్లిన తరువాత అనుకోకుండా దోపిడీకి పాల్పడిన హర్షవర్థన్ కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో నిందితులు వెంటనే ఆ కారులో నుంచి బయటకొచ్చి, వెనకాలే పైలెట్‌గా వస్తున్న విజయ్‌కుమార్ కారులో ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బోల్తాపడిన కారు వివరాలపై ఆరా తీయగా జడ్చర్లకు చెందిన అనుదీప్‌కు చెందినదిగా తేలింది.
దీంతో జడ్చర్ల పోలీసుల సహకారంతో అనుదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీకి స్కెచ్ వేసింది కారు డ్రైవర్ మధు అని తేలింది. దీంతో సాయిబాబా వెంట ఉన్న కారు డ్రైవర్ మధును అరెస్టు చేసి, అతడు ఇచ్చిన సమాచారంతో సంగారెడ్డి, షాద్‌నగర్ పోలీసుల సహకారంతో ముంబాయి హైవే, జహీరాబాద్ హైవే, బెంగుళూరు హైవేలపై ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టగా విజయ్‌కుమార్, అజార్, హర్షవర్ధన్, షమీముల్లా, అనుదీప్ చెరుకుల దీపక్‌లను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.17.50లక్షల నగదుతోపాటు బొమ్మ తుపాకి తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసు, శంకర్పల్లి దోపిడీ కేసులను ఛేదించిన పోలీసు బృందాలను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అభినందించారు. సంచలనం సృష్టించిన ఈ కేసులను వెనువెంటనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సైబరాబాద్ సీపీ మహంతిని డీజీపీ జితేందర్ అభినందించారు.