RRR | హైదరాబాద్ ( Hyderabad) చుట్టూ రావాల్సిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) కాస్త ఇప్పుడు సాధారణ హైవేగా మారిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్రిపుల్ఆర్ డిజైన్‌లో భారీ మార్పులు చేశారు. భారీ వ్యయం వల్ల ట్రిపుల్ఆర్ ప్రత్యేకతలను తొలగించి సాధారణ హైవేగా మార్పు చేశారు.
తొలుత దేశంలోనే 8 లైన్లతో కూడిన అతి పొడవైన రింగ్ రోడ్డుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అయితే దేశంలో మరో 20 ఏళ్ల వరకు రోడ్డు ట్రాఫిక్ కి 8 లైన్లు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆరు లైన్లకు కుదించింది. తొలుత అన్నకున్న దాని ప్రకారం రింగ్ రోడ్డు పొడవునా ఎలక్ట్రిక్ లైట్లు, ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థను ప్రతిపాదించారు. ఇప్పుడు ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్నది అని చెబుతూ కేవలం గ్రామాలు తగిలే ప్రాంతాల్లో మాత్రమే లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Rrr Regional Ring Road
తొలుత ORR తరహాలో ట్రిపుల్ ఆర్కు కూడా సర్వీస్ రోడ్డును ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు కనీసం కచ్చా రోడ్డు యాక్సెస్ కూడా లేకుండా కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉండేట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలుత ట్రిపుల్ ఆర్‌పై గరిష్ట వేగం గంటకు 120-130 కిలోమీటర్లు ఉండగా.. ఇప్పుడు గరిష్ట వేగం తగ్గించి గంటకు 100 కిలోమీటర్లు మాత్రమే చేశారు.
తొలుత ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలోనే మొత్తం 204 వంతెనలు నిర్మించాలని ప్రతిపాదించగా.. ఇందులో మూసీ నది మీద, మంజీరా నది మీద, హరిద్ర నది మీద, పలు వాగులు వంకల మీద వంతెనలు, కల్వర్టులు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పుడు వంతెనల వ్యయం భారీగా ఉండటంతో సగానికి సగం కుదించారు.
రోడ్డు నిలువు వాలు (వర్టికల్ కర్వ్) 1300 మీటర్లు ఉండేలా డిజైన్ అనుకున్నారు. అంటే 600 మీటర్ల దూరంలో పిల్లి సైజు జంతువు రోడ్డు దాటుతున్నా కనిపిస్తుంది. ముందే అప్రమత్తమై వేగాన్ని నియంత్రించే వీలు ఉండేది. కానీ ఇప్పుడు రోడ్డు నిలువు వాలు 650 మీటర్లకు కుదింపు.. అంటే కేవలం 360 మీటర్లు మాత్రమే విజిబిలిటీ ఉంటుంది. వాహనాలు ఒకవేళ పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.