Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం పూర్తిగా చల్లబడింది. నిన్న మొన్నటి వరకు ఉక్కపోతకు గురైన నగర ప్రజలు.. చల్లబడ్డ వాతావరణంతో ఉపశమనం పొందారు. బుధవారం రోజు నగరంలో 28.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ.. కొద్ది రోజుల క్రితం వరకు ఎండలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు చల్లటి వాతావరణంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక బుధవారం ఉదయం నుంచి అక్కడక్కడ ఎండలు, పలు చోట్ల ఆకాశం మేఘావృతమై ఉన్నది. మధ్యాహ్నం నుంచి నగరమంతా వర్షం కురిసింది. నగరమంతా మోస్తరు వర్షం కురిసింది. . హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో 3.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, బీహెచ్ఈఎల్లో 2.8 మి.మీ., గచ్చిబౌలిలో 2.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలోని గార్లలో 69 మి.మీ., ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో 49.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో నగరంతో పాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.