Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. నకిలీ భూమి రిజిస్ట్రేషన్ పేరుతో ఓ వ్యాపారవేత్త నుంచి కేటుగాళ్లు రూ.2.15 కోట్లు దోచుకోవడం సంచలనం రేపింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు రాయదుర్గంలోని ఓ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో ఒక దాంట్లో ఫ్యామిలీతో ఉంటున్నాడు. మరో ఫ్లాట్‌ను దివాకర్ బాబు పర్వతనేని అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. అయితే సదరు వ్యాపారవేత్తతో దివాకర్ పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ముత్తంగి సమీపంలో తనకు రూ.2.15 కోట్ల విలువైన 1.19 గుంటల భూమి ఉందని, దాన్ని తక్కువ ధరకే అమ్మాలని అనుకుంటున్నానని చెప్పాడు. దివాకర్‌కు అతని సోదరి కూడా మద్దతుగా ఉంది. వారి మాటలను నమ్మిన వ్యాపారవేత్త రెండు విడతల్లో రూ.2.15 కోట్లు బదిలీ చేశాడు. దీంతో కంది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వ్యాపారవేత్తను తీసుకెళ్లిన దివాకర్.. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినట్లుగా నమ్మించాడు.
అలాగే నిజాంపేటలో ఉన్న వ్యాపారవేత్తకు ఉన్న విల్లాను కూడా అమ్మిపెడతానని అతని నుంచి దివాకర్ పత్రాలు తీసుకున్నాడు. అనంతరం సంతకం ఫోర్జరీ చేసి లింగారెడ్డి అనే వ్యక్తికి సేల్ అగ్రిమెంట్ చేశాడు. ఇటీవల విల్లాను స్వాధీనం చేసుకునేందుకు లింగారెడ్డి వచ్చిన క్రమంలో ఈ మోసం బయటపడింది. వెంటనే కంది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి విచారించగా.. అసలు తన పేరిట ఎలాంటి భూమి రిజిస్ట్రేషన్ జరగలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.