రంగారెడ్డి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి ఫాం హౌస్లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని బుధవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు లింగంపల్లి సమీపంలోని ఫాంహౌస్లో మహిళలతో కలిసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మంచాల సీఐ మధు ఆధ్వర్యంలో రిసార్టుపై దాడిచేశారు.
రిసార్టులో నగరానికి చెందిన 25 మంది పురుషులు, 8 మంది మహిళలు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో బీర్లు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని 25 మందిపై కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన సప్తగిరి అనే వ్యాపారి స్నేహితులు 24 మంది కలిసి పార్టీ చేసుకునేందుకు బుధవారం రిసార్టుకు వచ్చారు. మరో 8 మంది మహారాష్ట్రకు చెందిన యువతులు ఉన్నారు. పోలీసులు వీరందరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2లక్షల నగదు, 10 కార్లు స్వాధీనం చేసుకున్నారు.