బేగంపేట్, జనవరి 20: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పాటు సాగే ఈ ఉత్సవాలను శుక్రవారం ఇండియన్ సైన్స్ ఫెస్టివల్లో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫర్ అడ్వాన్సింగ్ సైన్స్ టెక్నాలజీ, తెలంగాణ ఇన్నోవేషన్ కౌన్సిల్ సంయుక్తంగా ‘ఫ్యూచర్ ఈజ్ నౌ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, స్విట్జర్లాండ్ సీఈఆర్ఎన్కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త అర్చర శర్మ, ఐఎస్ఎఫ్ సలహాదారు ఫ్రొఫెసర్ కె.విజయ్‌రాఘవన్, ఫాస్ట్ ఇండియా ఫౌండర్లు వరుణ్ అగర్వాల్, ఆశీష్దావాన్, సీఈవో జయంత్‌కృష్ణ, టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ అఫీసర్ శాంతా తోతమ్, మైక్రోసాఫ్ట్, గూగుల్ రీసెర్చ్, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ, ఎయిమ్స్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వ విధానాలు.. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న విధానాలను వివరించారు. టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ అధికారి శాంతాతోతమ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆలోచనలతో సైన్స్ అండ్ టెక్నాలజీని అగ్రస్థానంలో నిలబెట్టడం జరిగిందన్నారు. ఇంక్యుబేషన్ ల్యాబ్‌ల నుంచి మార్కెట్లోకి ఆవిష్కరణలను తీసుకురావడం, హైదరాబాద్ నగరం ప్రపంచంలోనూ స్టార్టప్ సిటీగా మారుతుందని తెలిపారు. హెచ్‌పీఎస్ సొసైటీ అధ్యక్షుడు గుస్తీ నోరియా మాట్లాడుతూ ఏడాది పొడవునా నిర్వహించే ఈ ఉత్సవాల్లో విజ్ఞాన సముపార్జనకు పెద్దపీట వేసే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఇండియన్ సైన్స్ ఫెస్టివల్‌కు మూడు కేటాయించామన్నారు.