సుల్తాన్‌బజార్, జూన్ 16: బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి.. చిన్నారిని తల్లికి అప్పగించారు నాంపల్లి పోలీసులు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 13న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని మోతీ వైన్స్ ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై రిజ్వానా తన రెండున్నరేండ్ల కూతురుతో కలిసి నిద్రపోయింది. ఉదయం నిద్ర లేచి చూసే సరికి కూతురు కనిపించకపోవడంతో నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. 14 కిలోమీటర్ల పరిధిలోని వంద సీసీ కెమెరాలను పరిశీలించి.. బాలికను కిడ్నాప్ చేసింది చాంద్రాయణగుట్టకు చెందిన షేక్ అస్గర్(33)గా గుర్తించారు. అతడు రాజేంద్రనగర్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని.. అరెస్టు చేసి బాలికను తల్లికి అప్పగించారు.