సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలు అరికట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీనిలో భాగంగా పిరుమల్ క్యాపిటర్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(పిరుమల్ ఫైనాన్స్) సంస్థ ముందుకొచ్చిందని సీపీ వెల్లడించారు.
హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులతో కలిసి పిరుమల్ సంస్థ సైబర్నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, బుధవారం అవగాహన కార్యక్రమాలను బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిరుమల్ సంస్థ ఇతర రాష్ట్రాల్లోనూ అవగాహన కల్పిస్తుందని, తాజాగా మన రాష్ట్రంలోనూ నిర్వహించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. 15రోజులపాటు నిరంతరాయంగా(ట్యాగ్ లైన్-సబ్కి నియత్ సాఫ్ నై హోతి) వివిధ సంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలకు అర్థమయ్యేలా సైబర్‌నేరాలు జరుగుతున్న తీరు, వాటిని అడ్డుకోవడంపై అవగాహన కల్పిస్థారన్నారు.
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో జరిగిన దోపిడీ దొంగల కాల్పులపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. కాల్పుల ఘటనలో నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని, తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల పోలీసులు వెతుకుతున్నారన్నారు. కాల్పులు జరిపిన నిందితులు బీహార్‌వాసులుగా గుర్తించామని, నిందితులపై అక్కడి ప్రభుత్వం రూ.3లక్షల రివార్డు సైతం ప్రకటించిందని తెలిపారు.
నిందితులు తప్పించుకోవడానికి మాస్టర్‌మైండ్ వాడుతున్నారని, ఒకటిన్నర ఏండ్లుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారని, నిందితులను త్వరలో పట్టుకుంటామని, వదిలే ప్రసక్తే లేదన్నారు. నగరంలో కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు నార్త్వైపు వెళ్తారని భావించినా, సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లి, మియాపూర్ చేరుకొని ప్రధాన రహదారి మీదుగా చెన్నై వైపు వెళ్లారని సీపీ తెలిపారు.