సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టురట్టు చేసేందుకు హైదరాబాద్ పోలీసు విభాగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, విద్యాసంస్థలతో పాటు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో నిఘా కెమెరాల ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు షీనేత్ర టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఈ ప్రత్యేక బృందాలకు కెమెరా డిటెక్టర్ పరికరాలను అందించారు.
నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కోబృందం చొప్పున మొత్తం ఏడు షీ నేత్ర ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపింది. ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్ల వినియోగం, తనిఖీల సమయంలో పాటించాల్సిన నిబంధనల ఎస్‌వోపీపై రెండు దశల్లో పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్రూమ్లు, ఆసుపత్రులు, హోటళ్లు, హస్టళ్లలో రహస్యకెమెరాలు అమర్చి మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ ఏడు బృందాల ద్వారా నగరవ్యాప్తంగా ముమ్మురంగా తనిఖీలు చేపడతామని తెలిపారు. తమ ప్రాంగణాల్లోని ప్రైవేటు ప్రదేశాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవలసిన పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, అజాగ్రత్త ఉన్నా లేదా కెమెరాలు లభ్యమైనా సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అవసరమైతే ఆయా సంస్థలను, బాధ్యులైన ఉద్యోగులను బ్లాక్‌లిస్ట్ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాకుండా హార్డ్‌వేర్ రూపంలో సీక్రెట్ కెమెరాలను అమర్చి దుర్వినియోగానికి పాల్పడుతున్న కేసులు కూడా తమ దృష్టికి వస్తున్నాయని భవిష్యత్‌లో ఇవి మరింత పెరిగే ప్రమాదమున్నందున ముందు జాగ్రత్తగా షీనేత్ర బృందాలను ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు. నగరంలో ప్రతి సంస్థ తప్పనిసరిగా కస్టమర్ సేఫ్టీ ఇన్‌చార్జ్‌ను నియమించుకోవాలని, వీరు షీటీమ్స్‌కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించారు. వీరికి పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణనిస్తామని, కెమెరా డిటెక్టర్లను యాజమాన్యమే సమకూర్చుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో అదనపు సీపీ శ్రీనివాసులు, మహిళా భద్రతావిభాగం డీసీపీ డాక్టర్ లావణ్య, షీటీమ్స్ ఏసీపీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.