సిటీబ్యూరో/నేరెడ్మెట్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ముప్ఫై ఏండ్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నమ్మిన వారికి అధిక వడ్డీల ఆశ చూపి భారీగా వసూలు చేసిన ఓ సిమెంట్ వ్యాపారి రూ. 50 కోట్లతో ఉడాయించాడు. బాధితుల కథనం ప్రకారం.. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చక్రపురం, భగవాన్ కాలనీకి చెందిన పబ్బ చంద్రశేఖర్ స్థానికంగా శ్రీవెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ వ్యాపారం చేస్తూ, ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు.
స్థానికంగా ఉంటూ అందరిని నమ్మించాడు. కాగా తన కూతురు వివాహం కుదిరిందని, తండ్రి అనారోగ్యానికి చికిత్స చేయించాలని, భగవాన్ కాలనీలో ఇల్లు మిగతా నిర్మిస్తున్నానని కల్లిబొల్లి మాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద చేతు బదులుగా భారీగా డబ్బులు వసూలు చేశాడు. సిమెంట్ కంపెనీల స్కీమ్స్ డిపాజిట్ల కోసం రూ. 50 లక్షల జీఎస్టీ చెల్లిస్తే తనకు రూ. 3 కోట్లు రిలీజ్ అవుతాయని, మరికొందరి దగ్గర అధిక వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపి డబ్బులు వసూలు చేశాడు. ఇలా 80 మంది నుంచి రూ. 50 కోట్లకుపైగా వసూలు చేశాడు.
కాగా ఈ నెల 22వ తేదీ నుంచి అతడి రెండు సెల్‌ఫోన్ నంబర్లు స్విచ్ఛాప్ చేసి, రాత్రికి రాత్రే తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అంతకు ముందే తన ఇద్దరు కూతుర్లను తమ్ముడి ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడు. బాధితులు అతడి కూతుర్ల గురించి వాకబు చేస్తే స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లుగా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ వచ్చాడు. ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చంద్రశేఖర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.