దుండిగల్,సెప్టెంబర్5ః వినాయక ప్రతిమ నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు సదరు యువకులను అక్కడినుండి చెదరగొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అయితే తామెరిపైనా లాఠీచార్జీ చేయలేదని, ఇరువర్గాల మధ్య గొడవ జరిగితే బెదిరించి పంపించివేశామని సీఐ పేర్కొన్నారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాశ్నగర్ డివిజన్ పరిధి, సూరారం కాలనీ, సాయిబాబానగర్, వీరస్వామిబస్తీలో ఓ వినాయక విగ్రహాన్ని గురువారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. ఈ క్రమంలో శోభాయాత్రలో బ్యాండుమేళం, నృత్యం చేసే విషయంలో స్థానికంగా ఉండే రెండు గ్రూపులకు చెందిన యువకులు గొడవకు దిగారు.
వివాదం ముదురుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చెరుకుని ఇరువర్గాలకు చెందిన యువకులను అక్కడినుండి చెదరగొట్టారు. ఈ ఘటనలో అస్లాం, సంతోష్ అనే ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేశారని స్థానికులు పేర్కొంటుండగా, శాంతిభదత్రలను కాపాడే క్రమంలో గొడవపెద్దది కావోద్దనే ఉద్దేశ్యంతో రెండు గ్యాంగులకు చెందిన యువకులను అక్కడి నుండి చెదరగొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
తాము ఎటువంటి లాఠీచార్జి చేయలేదని, కేవలం రెండు గ్రూపుల యువకులను అక్కడి నుండి బెదిరించి పంపించివేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబందించిన యువకులను పోలీసులు తరుముతున్నట్లు ఎపిసోడ్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.