మెహిదిపట్నం, జూన్ 20: టోలిచౌకి (Tolichowki) పారామౌంట్ కాలనీలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా విదేశీయుల (నైజీరియన్లు సోమాలియన్లు) కారణంగా పారామౌంట్ కాలనీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తుండడంతో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 250 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. డీసీపీ చంద్రమోహన్, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధికి, ఏసీపీలు సుదర్శన్, సయ్యద్ ఫయాజ్, విజయ్ శ్రీనివాస్, మమ్మద్ మునావర్ తో పాటు 15 మంది ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 300 ఇండ్లను పోలీసులు తనిఖీలు చేశారు. 28 మంది విదేశీయుల వద్ద సరైన పత్రాలు లేవని, 16 మంది వీసా కాలం పూర్తయినట్లు గుర్తించామని డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. పత్రాలు సరిగా లేని 25 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రాన్ని గుర్తించి సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విదేశీయులకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ అధికారులకు పంపిస్తామని, దీనికి సంబంధించి వారే నిర్ణయం తీసుకుంటారని డీసీపీ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా పోలీసింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.