సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారిని వేధించే ఆకతాయిల ఆటకట్టించడంలో షీటీమ్స్ తమ సమర్థతను చాటుకున్నాయని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. గత ఏడాదిలో మొత్తం 1149 ఫిర్యాదులు అందగా వాటన్నిటినీ షీటీమ్స్ బాధ్యతాయుతంగా పరిష్కరించాయని తెలిపారు. ఈ ఏడాది నమోదైన కేసులను విశ్లేషిస్తే.. అత్యధికంగా 366 మంది బాధితులు బ్లాక్‌మెయిలింగ్ సమస్యతోనే షీటీమ్స్‌ను ఆశ్రయించారని, పాత ఫొటోలను అడ్డుపెట్టుకుని మాజీ ప్రేమికులు మహిళలను బెదిరింపులకు పాల్పడుతున్నారని, బాధితులకు అండగా షీటీమ్స్ నిలుస్తుందని ఆయన చెప్పారు.
కొత్త నెంబర్లు, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ప్రబుద్దుల వ్యవహారంలో 121 ఘటనలు నమోదు కాగా, పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారని, సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఐడీలు సృష్టించి వేధింపులకు పాల్పడిన ఘటనల్లో 82 కేసులను పరిష్కరించారని సజ్జనార్ తెలియజేశారు. ఈ ఏడాది అత్యంత ఆందోళన కలిగించే అంశంగా ప్రేమ పెళ్లి పేరుతో మోసాలను చూశామని, అమాయకులైన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటామని నమ్మించి, మోసం చేసి తీరా పెళ్లి ప్రస్తావన తేగానే ముఖం చాటేయడం వంటి 98 పిర్యాదులు అందగా మోసగాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు.
కేవలం ఫిర్యాదులే కాకుండా క్షేత్రస్థాయిలోనూ షీటీమ్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయని, నగరవ్యాప్తంగా 15 బృందాలు బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో మఫ్టీలో నిఘావేసి, గత ఏడాది ఏకంగా 3826 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారని సజ్జనార్ తెలిపారు. ఆడబిడ్డల జోలికొస్తే ఆకతాయిలను వదిలిపెట్టే సమస్యే లేదని, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి మహిళలను భయపెట్టాలని చూసే వారికి జైలు జీవితం తప్పదని సజ్జనార్ హెచ్చరించారు. మహిళలు ఏ మాత్రం భయపడకుండా ఇటువంటి ఆకతాయిల విషయాన్ని తమకు చెప్పాలని, ఒక్క ఫోన్ చేస్తే షీటీమ్స్ వారికి రక్షణ కవచంలా నిలుస్తుందని పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు.