సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న 573 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను శాంతి భద్రతల విభాగంతో పాటు ఇతర విభాగాలకు అటాచ్ చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. లా అండ్ ఆర్డర్‌కు 284, ట్రాఫిక్ 225, మిగతా వాళ్లను ఎస్బీ, టాస్క్‌ఫోర్స్, హెచ్‌న్యూ, సైబర్‌క్రైమ్ విభాగాలకు అటాచ్ చేశారు. ఇందులో 223 మంది మహిళలు, 350 మంది పురుషులు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏఆర్ కానిస్టేబుళ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ వీనీ ఆనంద్ మాట్లాడుతూ శాంతి భద్రతల విభాగంతో పాటు ఇతర విభాగాలను మరింత మెరుగు పరచడంలో భాగంగా సివిల్ కానిస్టేబుళ్లకు అదనంగా ఏఆర్ కానిస్టేబుళ్లను ఆయా విభాగాలకు అటాచ్ చేస్తున్నట్లు తెలిపారు.
నగరంలో ప్రశాంతత ఉన్నప్పుడే..
ఇక నుంచి సివిల్ పోలీసులతో కలిసి ఏఆర్ పోలీసులు పనిచేయాలని సీపీ సూచించారు. చాలా సహనంతో, వివిధ వర్గాల ప్రజల మధ్య పనిచేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ర్టానికి హైదరాబాద్ రాజధాని కావడంతో శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి ముఖ్య కర్తవ్యమన్నారు. ఇది కేవలం అటాచ్మెంట్ మాత్రమేనని, వారికి సీనియార్టీ లేదా విభాగ మార్పిడి హక్కులు ఉండవని, పోలీస్స్టేషన్లలో పెట్రోలింగ్, ప్రాథమిక విధులు నిర్వహించే సిబ్బంది సివిల్ పోలీసుల కొరతను అధిగమించడానికి ఈ విధంగా అటాచ్మెంట్ చేస్తున్నామన్నారు. నగరంలో ప్రశాంతత ఉన్నప్పుడే పెట్టుబడులు వచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, నగరానికి తద్వారా రాష్ర్టానికి మంచిపేరు వస్తుందన్నారు.