సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడిగా కొనసాగి, నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి ఇటీవలే పోలీసులకు చిక్కిన ముద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్నపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అతడిపై 2004 నుంచి పలు హత్యలు, ఇతర కేసులు ఉన్నాయి. 11 హత్య కేసుల్లో నిందితుడిగా ఉండగా.. 5 కేసుల్లో తప్పించుకు తిరుగుతున్నాడు.
2004లో అచ్చంపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనకా చారి, 2005లో మహబూబ్‌నగర్‌లో చెంచు గోవిందు, 2011లో పహాడీషరీఫ్‌లో శ్రీధర్‌రెడ్డి, బొగ్గులకుంటలో పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, 2013లో అంచ్చంపేటలో కానిస్టేబుల్ శ్రీనివాసరావు, 2014లో నల్గొండలో కోనపూరి రాములు తదితర హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పిస్టల్, 5 రౌండ్ల లైవ్ బుల్లెట్లతో ఈ ఏడాది సెప్టెంబర్ 27న గోల్కొండ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేరచరిత్ర ఆధారంగా నిందితుడిపై తాజాగా పీడీ యాక్టు ప్రయోగించారు.