సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): భార్య గొంతు కోసి.. తాను ఆత్మహత్యాయత్నానికి యత్నించిన యువకుడిని ఐఎస్ సదన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీ రోహిత్‌రాజ్ కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం నాగులధోని తాండకు చెందిన కత్రావత్ ప్రేమ్‌కుమార్ అలియాస్ చిన్న, స్వప్న దంపతులు. చంపాపేటలోని ఎస్జీఆర్ కాలనీలో నివాసమున్నారు. స్వప్న తరచూ తన స్నేహితుడైన సురేశ్‌తో మాట్లాడటంతో భర్త ప్రేమ్‌కుమార్ పలుమార్లు హెచ్చరించాడు. అయినా.. ఆమె తన ప్రవర్తనను మార్చుకోలేదు.
గత నెల 28న స్వప్న స్నేహితుడైన సురేశ్‌తో తన ఇంట్లో మాట్లాడుతుండగా ప్రేమ్ చూశాడు. అప్పటికే తాను డీమార్టు నుంచి తెచ్చుకున్న కత్తితో స్వప్నను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు. తాను కూడా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో సురేశ్‌ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, కోమాలోకి వెళ్లిన ప్రేమ్ దవాఖానలో కోలుకున్నాడు. అతడి ఆరోగ్యం కుదుటపడటంతో భార్యను హత్య చేసిన కేసులో ప్రేమ్‌ను కూడా బుధవారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్టు డీసీపీ వెల్లడించారు.