బంజారాహిల్స్, ఏప్రిల్ 24: అసలే కరోనా కష్టకాలం.. అందరూ ఉన్నా కష్టసుఖాలు అడిగే దిక్కులేని పరిస్థితి.. ఈ తరుణంలో ఎవరూ లేని ఓ వృద్ధురాలి కష్టాలను చూసి బంజారాహిల్స్ పోలీసులు చలించారు.. ఆమెను చేరదీసి అనాథాశ్రమానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నం.13లోని శ్రీరాంనగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నాగమ్మ(65)కు భర్త చాలా ఏండ్ల క్రితం చనిపోగా… ఉన్న ఒక్క కొడుకు ఇటీవల మృతి చెందగా.. ఆమె ఒంటరి అయింది. బంధువులు ఎవరూ లేకపోవడంతో రోడ్డుమీదకు వచ్చి అడుక్కుంటూ జీవనం సాగిస్తోంది.
అర్ధాకలితో అలమటిస్తూ ఒంటరిగా ఉంటున్న నాగమ్మ దుస్థితిని స్థానికంగా ఉండే సౌజన్య అనే మహిళ ఎస్ఐ ఉదయ్‌కుమార్‌కు తెలిపింది. వెంటనే స్పందించిన ఎస్ఐ పెట్రోలింగ్ పోలీసులను ఆమె వద్దకు పంపించి.. వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బన్సీలాల్‌పేటలోని ‘హోమ్ ఫర్ ఏజ్డ్’ వృద్ధాశ్రమం నిర్వాహకులతో మాట్లాడగా.. వారు ఒప్పుకున్నారు. శనివారం ఆశ్రమం ప్రతినిధులు శ్రీరాంనగర్‌కు వచ్చి నాగమ్మకు కరోనా పరీక్షలు చేసి..నెగెటివ్ అని తేలడంతో వృద్ధాశ్రమానికి తీసుకువెళ్లారు. మానవత్వంతో వృద్ధారాలిని ఆశ్రమానికి తరలించిన పోలీసులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.