సైదాబాద్, సెప్టెంబర్ 20: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీలో కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసుల యాక్షన్ ప్లాన్ మొదలైంది. అన్నికోణాల నుంచి ఆరా తీస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలను అధికారులు పరిశీలించి..ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
బస్తీలో పది రోజుల కిందట ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య చేసిన కామాంధుడు మత్తుకు బానిసై ఈ దురాఘతానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. మద్యం విక్రయాలు, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. గుడిసెవాసుల పేదరికం, అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని.. కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సింగరేణి కాలనీలో బెల్ట్ షాపులను నడుపుతున్న 15 మందిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. రూ. 50వేల చొప్పున వ్యక్తిగత జామీను చెల్లించిన అనంతరం విడుదల చేశారు. బైండోవర్ అయిన వారిలో నలుగురు మళ్లీ మద్యం అమ్మకాలు జరిపారు. తిరిగి వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. గుడిసెల్లో ఆకస్మికంగా దాడులు చేసిన పోలీసులు.. మద్యం అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, ముగ్గురు తప్పించుకున్నారు. ఒకరిని పట్టుకొని.. రెండు లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. పారిపోయిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు.