సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): వృద్ధుడి దయనీయ స్థితిని చూసిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవతా హృదయంతో స్పందించాడు. బట్టలు తొడిగించి, అన్నం పెట్టి ఆదరించాడు. వాట్సాప్‌లో అతడి ఫొటోతో సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు ఆచూకీ తెలిసింది. లొకేషన్ షేర్ చేయడంతో వృద్ధుడి కుమార్తె, అల్లుడు వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ ట్రాఫిక్ పీఎస్ కానిస్టేబుల్ సుధాకర్.. నర్సాపూర్ క్రాస్ రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో ఓ 70 ఏండ్ల వృద్ధుడు చినిగిపోయిన అంగీ ధరించి.. రక్తగాయాలతో..కింది భాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా రోడ్డు పై ఉండడాన్ని గమనించాడు.
ముందుగా అతనికి లుంగీ కట్టించి. చిరునామాను అడిగాడు. అతనికి భోజనం పెట్టించి.. ఆ తర్వాత మరోసారి మాట్లాడగా.. తనది కామారెడ్డి జిల్లా లింగంపేట్ గ్రామం అని చెప్పాడు.. వెంటనే కానిస్టేబుల్ వృద్ధుడి ఫొటోను వాట్సాప్‌లో తీసి అక్కడి ఎస్ఐకు పంపాడు. అప్పటికే ఎస్ఐకు సమాచారం ఉండటంతో విషయాన్ని.. అతడి కూతురికి చెప్పాడు. ఆమె కానిస్టేబుల్‌కు ఫోన్‌చేసి తన తండ్రి ఉన్న లొకేషన్‌ను షేర్ చేయమని చెప్పగా పంపించాడు.. వెంటనే వారు నర్సాపూర్ క్రాస్ రోడ్డు వద్దకు వచ్చి రాములును గుర్తించి ఇంటికి తీసుకువెళ్లారు.
కంటి పరీక్షల కోసం సరోజినిదేవి కంటి దవాఖానకు వచ్చాడని, రెండు రోజుల నుంచి కనిపించడం లేదని అతడి కూతురు, అల్లుడు తెలిపారు. తన తండ్రి క్షేమంగా దొరకడంతో కూతురు..కానిస్టేబుల్ సుధాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీపీ పాల్వాయి శ్రీనివాస్‌రెడ్డి.. మంగళవారం సుధాకర్‌కు రివార్డును అందించారు.